గెలుపు మాదంటే మాదే

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సందిగ్ధత.. ఫలితాలపై స్పందించిన ఆర్మీ చీఫ్​

Feb 10, 2024 - 16:14
 0
గెలుపు మాదంటే మాదే

ఇస్లామాబాద్​: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 133 సీట్లు కాగా.. ఈ సంఖ్యకు దగ్గరలో ఏ పార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది. పార్టీ గుర్తుతో పోటీ చేయకుండా పీటీఐపై నిషేధం ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ తన అభ్యర్థులను ఇండిపెండెంట్ గా నిలబెట్టారు. తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ వాళ్లే ఎక్కువ చోట గెలిచారు. అయితే, వారికి పార్టీ గుర్తు లేకపోవడంతో తమదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని, ఈ ఎన్నికల్లో తామే గెలిచామని నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నారు. తన అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు కాబట్టి తనదే విజయమని ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

మరో 15 సీట్ల ఫలితాలు రావాలి..

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాక్​ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 99 చోట్ల గెలుపొందారు. ఇక, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్​ ముస్లిం లీగ్ - నవాజ్(పీఎంఎల్ఎన్) పార్టీ 71 సీట్లను గెలుచుకోగా, భిలావల్ భుట్టో జర్దారీ పార్టీ పాక్​ పీపుల్స్ పార్టీ 53 సీట్లలో గెలిచింది. మరో 27 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరో 15 సీట్లలో ఫలితాలు ఇప్పటికీ వెలువడలేదు.

దేశాన్ని నడిపించే ప్రభుత్వం కావాలి..

ఎన్నికల ఫలితాలపై పాక్​ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ స్పందిస్తూ.. దేశానికి ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. అరాచక పాలనకు సంబంధించిన గాయాలకు మందుపూస్తూ, అభివృద్ధి వైపుగా దేశాన్ని నడిపించే ప్రభుత్వం కావాలని అభిప్రాయపడ్డారు. పాతిక కోట్ల జనాభా ఉన్న దేశానికి అరాచక పాలన శోభనివ్వదని చెప్పారు. ఎన్నికలంటే గెలుపు ఓటములు కాదని, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండే ప్రక్రియ అని అసీం మునీర్ పేర్కొన్నారు. ఈమేరకు పాక్ ఆర్మీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.