మాతా శిశు సంరక్షణకు తగిన చర్యలు

కలెక్టర్ అభిలాష అభినవ్

Jun 25, 2024 - 20:25
 0
మాతా శిశు సంరక్షణకు తగిన చర్యలు

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్​ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కరుణ మాట్లాడుతూ, సంక్షేమ శాఖ ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను వందశాతం అమలు చేయాలని సూచించారు. అంగన్​ వాడీల్లో ఐదేళ్ళ లోపు పిల్లలందరినీ చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారంతో పాటు బాలామృతం, కోడుగుడ్డు అందించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా పిల్లల ఎదుగుదలను నమోదు చేయాలని, అన్ని అంగన్​ వాడీల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పిల్లలను ఆకర్షించేలా పెయింటింగ్స్, ఆట వస్తువుల వంటి వాటిని ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. 

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్​ వాడీ కేంద్రాలలో అన్ని రకాల వసతుల కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో అంగన్​ వాడీలను సమర్ధవంతంగా నిర్వహిస్తామన్నారు. కేంద్రాలలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఏ.నాగమణి తదితరులు పాల్గొన్నారు.