మదకద్రవ్యాలతో సమాజానికి చేటు

ఏసీపీ రవి కుమార్

Jun 26, 2024 - 15:43
 0
మదకద్రవ్యాలతో సమాజానికి చేటు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సమాజానికి చేటుగా పరిణమించిన మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు సంఘాలు, యూనియన్లు, సింగరేణి కార్మికులు, విద్యార్థులతో సింగరేణి ఉన్నత పాఠశాల నుంచి మార్కెట్ మీదుగా సింగరేణి క్రీడా మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని యువతకు సూచించారు. మాదకద్రవ్యాలు సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరం అని తెలిపారు. విద్యార్ధి దశలోనే క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టపడి చదివిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి జీవిత కాలం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతా రన్నారు. చెడు వ్యసనాలకు బానిసలై చదవ కుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు, శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాద్యాయులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి రవి, మందమర్రి ఎస్సై రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్, దేవపూర్ ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.