ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు
ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన డోర్నకల్ ఎమ్మెల్యే డా. చంద్రునాయక్
నా తెలంగాణ, డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే డా. రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తున్నామని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు లాంటి సౌకర్యాలను కల్పించామన్నారు. అంతేగాక ఆకర్షణీయమైన తరగతి గదులను తీర్చిదిద్దామని తెలిపారు. విద్యార్థులకు విశాలమైన ఆటస్థలాల, తాగేందుకు మంచి నీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు. అందుకే ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.