నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వరుస రైలు ప్రమాదాలు, ఘటనలకు పాల్పడుతున్న విద్రోహ శక్తులపై కేంద్రప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. 1989 సెక్షన్ 151ని పూర్తిగా సవరించనుంది. రైలు పట్టాలపై విద్రోహ కార్యకలాపాలకు పాల్పడేవారు ఇక జీవితాంతం జైలులోనే మగ్గేలా దేశ ద్రోహ చట్టం వంటి పటిష్ఠ సవరణను చేపట్టనుంది. రైల్వే ట్రాక్ లపై బారికేడ్లు వేయడం, సిలిండర్లు, పట్టాల నట్లు, బోల్టులు విప్పడం, పట్టాలపై రాడ్లు ఉంచి రైలు ప్రమాదాలకు కారణమవ్వడం వంటివి ఇక సామూహిక హత్య సెక్షన్ కిందకు తేనుంది. ఈ చట్టం ప్రకారం ఇక నేరుగా జీవితఖైదు, మరణశిక్షలను విధించనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించేందుకు సన్నాహాల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు.
అంతేగాక రైల్వే ట్రాక్ లపై పోలీసులు, గ్యాంగ్ మెన్ ల నిఘా పెంచాలని హోంశాఖ నిర్ణయించింది. సున్నిత ప్రాంతాల్లో కెమెరాలు అమర్చాలని రైల్వేశాఖ సన్నాహాలను ప్రారంభించింది. రైల్వే ఇంజన్ కు ముందు భాగంలో కూడా కెమెరాలు అమర్చాలని యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆపగలుగుతారు.