దేవాలయాలపై పన్ను

కర్ణాటక ప్రభుత్వం చట్ట సవరణ ఎండోమెంట్​ యాక్ట్​ లో కీలక మార్పులు

Feb 24, 2024 - 18:39
 0
దేవాలయాలపై పన్ను
దేవాలయాలపై పన్ను
బెంగళూరు: కర్ణాటకలో హిందూ మతం కొనసాగుతున్న ఎండోమెంట్స్​ యాక్ట్​ –1997ను సవరించి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం 20024లో సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ సవరణ చట్టం ప్రకారం దేవాలయాల్లో లభించిన సంపదపై ఆ రాష్ర్ట ప్రభుత్వం పన్ను విధించనుంది.
వివరాల్లోకి వెళితే..
 
హిందూ మత సంస్థలు, దేవాదాయ ధర్మాదాయాల (సవరణ) బిల్లు?
కర్ణాటక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా ఈ బిల్లును సభ ఆమోదింపచేసుకోలేకపోయారు. 
 
వాస్తవానికి కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ 1997ను సవరించే బిల్లును తీసుకొచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 17ను సవరించాలని ఈ బిల్లు కోరుతోంది. చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నిధికి కామన్ పూల్ ఏర్పాటు చేయాలి. 2011లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించిందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ మార్పు కామన్ పూల్ నిధులను ఉపయోగించి తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు సహాయపడేందుకు అధిక ఆదాయ దేవాలయాల నుంచి నిధులను సేకరించేందుకు వీలు కల్పిస్తోంది. అల్పాదాయ ఆలయాలను సీ కేటగిరీలో, అధిక ఆదాయం ఉన్న ఆలయాలను ఏ కేటగిరీలో వర్గీకరించారు.
 
2011 ప్రకారమే సవరణ..
2011 సవరణ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్న ఆలయాలు తమ నికర ఆదాయంలో ఐదు శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం సవరణ చేసింది. రూ.10 లక్షలు, అంతకంటే తక్కువ వార్షికాదాయం ఉన్న ఆలయాలకు మినహాయింపు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరు జనరల్ పూల్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదని సవరణలో పేర్కొన్నారు. రూ.10 లక్షలకు పైగా వార్షికాదాయం, రూ.కోటిలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు 5 శాతం, రూ.కోటికి పైగా వార్షికాదాయం ఉన్న ఆలయాలు తమ వార్షిక ఆదాయంలో 10 శాతం చెల్లించాలని ఈ సవరణ ప్రతిపాదిస్తోంది.
 
దేవాలయాల ఆదాయం నుంచి వచ్చే నిధులను కామన్ పూల్ ఫండ్ లో ఉంచాలని, దీనిని రాష్ట్ర ధార్మిక మండలి నిర్వహిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 'సి' కేటగిరీ ఆలయాల్లో వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అర్చకుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాల వ్యతిరేకత..
ఈ బిల్లును బీజేపీ, జేడీఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. దేవాలయాలపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం తన ఖాళీ ఖజానాను నింపుకోవాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. 
 
మండిపడుతున్న హిందూ సంస్థలు
హిందూ మత సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఇప్పుడు వారి కళ్లు హిందూ దేవాలయాలపై ఉన్నాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప మండిపడ్డారు.  ఖాళీగా ఉన్న ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని దీన్ని ఆమోదింప చేస్తే తీవ్ర పరిణామాలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరించారు. 
 
హిందూ దేవాలయాలే టార్గెట్టా?యాడ్యూరప్ప మండిపాటు..
రూ.కోటి దాటిన ఆలయ ఆదాయంపై ఈ ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుందని, ఇది పేదరికం తప్ప మరేమీ కాదన్నారు. భక్తుల నుంచి వచ్చే విరాళాలను ఆలయాల పునర్నిర్మాణానికి, భక్తుల సౌకర్యాల పెంపునకు వినియోగించాలని, కానీ మరేదైనా పనులకు కేటాయిస్తే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోందని యడ్యూరప్ప ప్రశ్నించారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరేంటి?
కాంగ్రెస్ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం కామన్ పూల్ ఫండ్ కు ఏటా ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. అదే సమయంలో 'సి' గ్రూప్ ఆలయాల అర్చకులు, ఉద్యోగుల డిమాండ్లను కూడా నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు జనరల్ పూల్ లో నిధుల లభ్యతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. బిల్లును సోమవారం మరోమారు అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.