ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యం

క్వాడ్​ సదస్సులో ప్రధాని మోదీ

Sep 22, 2024 - 14:41
 0
ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యం
ఇండిపసిఫిక్​ దేశాల బంధాలు మరింత బలోపేతం
4కోట్ల గర్భాశయ వ్యాక్సిన్లు అందజేస్తాం
సీ గార్డియన్​ డ్రోన్ల కొనుగోలుపై కుదిరిన ఒప్పందం
యూఎన్​ఎస్​ సీలో భారత్​ సభ్యత్వానికి మద్ధతు: బైడెన్​
వాషింగ్టన్​: ప్రపంచంలో పలుదేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడం, అదే సమయంలో క్వాడ్​ దేశాల సమగ్రతను కాపాడుకోవడం, ద్వైపాక్షిక బంధాలు మెరుగుపర్చుకోవాలని క్వాడ్​ దేశాల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం డేలావేర్ లోని శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, ఆస్ట్రేలియా పీఎం అంథోనీ అల్బనీస్​, జపాన్​ పీఎం ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. సమావేశ అనంతరం ఫోటోషూట్​ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జో బైడెన్​ ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి ప్రధాని చర్యలను కొనియాడారు. సమావేశం అనంతరం ఆస్ట్రేలియా పీఎం అంథోనీ అల్బనీస్​, జపాన్​ పీఎం ఫుమియో కిషిదాతో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 
 
ప్రధాని మోదీ: ఈ సందర్భంగా ప్రధాని మోదీ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ.. వివాదాలు చుట్టుముట్టిన తరుణంలో ఈ సమావేశం నిర్వహించడం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. శాంతియుత పరిస్థితులకు పరిష్కారం దిశగా కూడా సమావేశంలో మాట్లాడామన్నారు. ఇండో పసిఫిక్​ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చర్చించామన్నారు. అమెరికాతో మూడు బిలియన్​ డాలర్ల సీ గార్డియన్​ డ్రోన్​ ల చర్చ అనంతరం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 31 అత్యాధునిక డ్రోన్​ లను భారత్​ కొనుగోలు చేయనుంది. భారత్​ ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. గర్భాశయ క్యాన్సర్​ నిరోధానికి స్వంత వ్యాక్సిన్​ ను కూడా తయారు చేశామన్నారు. 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్ కిట్లు, వ్యాక్సిన్‌ లను కూడా పంపిణీ చేస్తామని మోదీ ప్రకటించారు. వచ్చే క్వాడ్​ సమావేశాన్ని భారత్​ లో నిర్వహించేందుకు ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. క్వాడ్​ చరిత్ర సుధీర్ఘమైనదని, సంప్రదాయాలకు కట్టుబడి సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు మంత్రి జై శంకర్​, విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్ర్తీ, భారత రాయబారి వినయ్ మోహన్​ తదితరులు పాల్గొన్నారు. 
 
సమావేశానికి ముందు మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ప్రధాని వారిని కలిసి ఉత్సాహపరిచారు. 
 
జో బైడెన్​: ప్రజాస్వామ్య దేశంలో ఎలా పనిచేయాలో క్వాడ్​ దేశాలకు తెలుసని ఇన్నేళ్ల తరువాత కూడా తాము గతంలో కంటే ఐక్యంగా, పటిష్ఠంగా ఉన్నామని అన్నారు. క్వాడ్​ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించే దిశగా చర్చలు ఫలప్రదం అయ్యాయని తెలిపారు. అలాగే యూఎన్​ ఎస్​ సీ (ఐక్యరాజ్యసమితి)లో భారత్​ కు సభ్యత్వం అందజేయాలన్న విషయంపై కట్టుబడి ఉన్నామని తెలిపారు. క్వాడ్​ ఇచ్చే ఫెలోషిప్​ లో ఆగ్నేయాసియా దేశాల విద్యార్థులను కూడా చేర్చుకుంటామని తెలిపారు.  ఇండోపసిఫిక్​ లో ప్రస్తుతం అత్యంత ఆందోళన కలిగించే అంశం గర్భాశయ క్యాన్సర్​ అన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్​ నాలుగు కోట్ల వ్యాక్సిన్లను అందించాలని నిర్ణయించడంపై బైడెన్​  హర్షం వ్యక్తం చేశారు. ఇండోపసిఫిక్​ ప్రాంతంలో ప్రతీయేటా 1.5 లక్షలమంది మహిళలు గర్భాశయ క్యాన్సర్​ తో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై క్వాడ్​ దేశాలతో కలిసి పనిచేస్తూ పూర్తి నివారణకు కట్టుబడి ఉన్నామన్నారు.