బాలికకు అబార్షన్.. క్లినిక్ సీజ్
ఆర్ ఎంపీ, పీఎంపీలు అనధికారిక ప్రాక్టీస్ పై కఠిన చర్యలు తప్పవు జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు హెచ్చరిక
నా తెలంగాణ, షాద్ నగర్: నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు మెడికల్ ప్రాక్టీస్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస క్లినిక్, బిహెచ్ఎమ్ఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ వి.రంజిత్, రెండు రోజుల క్రితం గిరిజన మైనర్ బాలికకు అబార్షన్ చేసిన కేసు విషయంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, షాద్ నగర్ డిప్యూటీ డిఎంఅండ్.హెచ్ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి జిల్లా వైద్యశాఖ బృందం కలిసి శుక్రవారం క్లినిక్ ను సీజ్ చేశారు.
డాక్టర్ వి. రంజిత్ కు గత రెండు నెలల క్రితం డివిజన్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి నోటీసులు జారీ చేసినట్టు జిల్లా వైద్యశాఖ అధికారి స్పష్టం చేశారు. హోమియోపతి డాక్టర్ చదువుకున్నారు అదే ప్రాక్టీస్ చేయాలని నోటీసు కూడా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వైద్య పరిధి దాటి ప్రాక్టీస్ చేయకూడదని నోటీసులో పేర్కొన్నారు. అయినా అతని యొక్క పరిధి దాటి గిరిజన మైనర్ బాలికకు అబార్షన్ చేయడంను ఖండిస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి. వెంకటేశ్వరరావు శ్రీ శ్రీనివాస క్లినిక్ ను సీజ్ చేస్తున్నామని తెలిపారు.
డివిజన్ లోని అన్ని మండలాల్లో ఆర్ఎంపి వైద్యులు, పిఎంపి వైద్యులు ఇతర ఏ ఆసుపత్రి వైద్యాధికారైనా కూడా ఇల్లీగల్ ప్రాక్టీస్ చేసినట్లయితే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే రంజిత్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ తిరుపతి రావు, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి కె.శ్రీనివాసులు, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హరికిషన్, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, సిహెచ్ఓ నాగేష్, శ్రీకాంత్, నవాజ్ ఆశలు పాల్గొన్నారు.