భారీ వర్షం నిర్మల్ జలసంద్రం
చెరువుల ఆక్రమణలే కారణం?
నా తెలంగాణ, నిర్మల్: గత ప్రభుత్వాల ఆక్రమణల ఫలితంగా నిర్మల్ పట్టణం మరోసారి జలసంద్రంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం గంట పాటు కురిసిన భారీ వర్షం ఫలితంగా నిర్మల్ పట్టణం జల సంద్రంగా మారిపోయింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ మోకాలి లోతు నీళ్లతో మునిగాయి. ప్రధానంగా 44 నెంబర్ జాతీయ రహదారిపై శివాజీ చౌక్, డాక్టర్స్ లేన్ తదితర ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని శివాజీ చౌక్ లో మోకాలిలోతు నీళ్లు నిండిపోయి పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అలాగే పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం లోపలికి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. అలాగే కోర్టు ఎదుట కూడా రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దీంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గత పాలకుల ఆక్రమణలే ప్రధాన కారణం?
గత పాలకులు చెరువులను సైతం అన్యాక్రాంతం చేయడంతో పట్టణంలోని నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక పట్టణం ప్రతి ఏటా ముంపునకు గురవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ నేతలు కొందరు చెరువుల్లో సైతం పట్టాలు సృష్టించి చెరువులను కబ్జా చేశారు. ఫలితంగా చెరువుల సైజులు కుదించుకుపోయాయి. ప్రధానంగా ధర్మసాగర్ చెరువులో సైతం పట్టాలు సృష్టించిన వైనం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే నిర్మల్ లోని కందకాలు కాలువలు సైతం పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిన సత్యం అయితే అనుమతులు ఇవ్వాల్సిన మున్సిపల్ శాఖ భూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న రెవెన్యూ శాఖ చెరువుల సైతం ఆక్రమణలకు గురవుతుంటే ఏం చేస్తున్నాయి అన్నది అంతుపట్టని ప్రశ్న.
కాగా కలెక్టరేట్ ను సైతం చెరువుకు సంబంధించిన భూమిలో నిర్మించడం వెనుక మాజీ ప్రజా ప్రతినిధి ప్రమేయం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇలా నాయకులు స్వార్థంతో తమ ఆస్తులను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పట్టణ ప్రజలకు శాపంగా మారాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన జిఎన్ఆర్ కాలనీ, ప్రియదర్శిని నగర్, డాక్టర్స్ లేన్, 44వ జాతీయ రహదారి ప్రాంతాలు పూర్తిగా రాకపోకలకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. గత రెండేళ్లుగా పలు కాలనీలు ముంపునకు గురై అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయమై జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అవి బుట్ట దాఖలయ్యాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.