దుబాయ్ లో కార్మికుడి మృతి
కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత గడ్డం శ్రీనివాస్ అన్ని రకాల సహాయం చేస్తామని హామీ బాధితుని కుటుంబానికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్యనందించాలని డిమాండ్
నా తెలంగాణ, మెదక్: బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడే మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీజేపీ నాయకుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు.
మంగళవారం తిమ్మక్కపల్లి తండాలోని సూర్య కుటుంబాన్ని పరామర్శించి సంతాపం, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్య సతీమణి సరితకు ఉపాధి కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయనుకున్న నిరుపేదల బతుకులు మాత్రం తెల్లారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతం, ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుండడం వల్ల రాష్ర్టం నుంచి వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నిత్యావసరాలను అందించారు. బాధిత కుటుంబానికి ఒక ఉద్యోగంతోపాటు వారి పిల్లలకు ఉచిత విద్యనందించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పార్టీ తరఫున ఇప్పటికే దుబాయ్ రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరిపారన్నారు. వీలైనంత త్వరలో సూర్య మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఎల్ ఎన్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండేవీన, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి సార లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.