నా తెలంగాణ, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దయనీయంగా మారిందని ఏబీవీపీ నగర కార్యదర్శి మహేష్ అన్నారు. సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 31, సెప్టెంబర్ 1, తేదీలల్లో నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో విద్య రంగ స్థితి, రాష్ట్ర స్థితి అంశాలపై చర్చించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బతుకులు మారడం లేదని నియంత పోకడలు పోవడం లేదని విమర్శించారు. గత పాలకులు విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిందన్నారు.
పేద, మధ్యతరగతుల సంజీవని లాగా ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. గత మూడు సంవత్సరాలుగా రూ.7500 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ పెండింగ్ లో ఉన్నా ఈ ప్రభుత్వం ఏమి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో విభాగ్ హాస్టల్ కన్వీనర్ తానాజీ, కార్యాలయ కార్యదర్శి నిఖిల్, మల్లేష్, చిన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.