దేశ ఆత్మగౌరవ విజయం
సార్వభౌమాధికారం కోసమే తన తపన
- పాక్ కు ఇంకా బుద్ధిరాలే
- బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ఇవ్వనివారు సైనిక రంగాన్ని విమర్శిస్తారా?
- సరిహద్దుల శాంతికి ప్రత్యేక బడ్జెట్
- సైనికులకు పూర్తి ఆర్థిక సహాయ సహకారాలు
- శాంతి, సుస్థిరత, అభివృద్ధియే ముఖ్యం
- షింకున్ టన్నెల్ శంకుస్థాపన
- 25వ విజయ్ దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ
శ్రీనగర్: కార్గిల్ విజయం 140 కోట్ల మంది భారతీయులదని, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులదని, దేశ ఆత్మగౌరవ విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చరిత్రతో పాకిస్థాన్ కు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. సరిహద్దుల్లోని సైనికుల భద్రత పట్టకుండా వారికి బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ఇవ్వని వారు కూడా సైనిక రంగంపై విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అగ్నిపథ్ తో యావత్ దేశం బలపడుతుందని అన్నారు. సరిహద్దుల బలోపేతం, దేశ జవాన్ల రక్షణ కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, బడ్జెట్ లో నిధుల పెంపు, ఆయుధ రంగాన్ని బలోపేతం చేయడం, సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి పథకాల ద్వారా ఆర్థిక సహయం చేయడం వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్ లో శాంతి, అభివృద్ధి, విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధి లాంటి పనులను ప్రజలు సంపూర్ణంగా స్వాగతిస్తున్నారని తెలిపారు.
కొందరు ఉగ్రవాద మద్ధతుదారులు (కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ) దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేలా, మన సైనిక శక్తిని కించపరిచేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. ఈ వేదిక ద్వారా అలాంటి వారికి, ఉగ్రవాదులకు సూటిగా తాను ఒక విషయం చెబుతున్నానన్నారు. ప్రస్తుతం భారత్ అఖండ, ఐక్య భారత్ అన్నారు. దిగుమతులు చేసే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చామన్నారు. పూర్తిగా ఉగ్రవాద మద్ధతుదారులు, ఉగ్రవాదుల పీచమణుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కార్గిల్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయ ద్రాస్ సెక్టార్ లోని కార్గిల్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. సైనికులకు వందనం సమర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం కార్గిల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు.
ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు..
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ ప్రజలు మరోమారు కార్గిల్ విజయ దివస్ ను ఘనంగా నిర్వహించుకునే అవకాశం తమకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం, యావత్ దేశ ప్రజలు గర్వించదగ్గ రోజన్నారు. దేశ సైనికులు భారత ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు. వారి సేవలు వెలకట్టలేనివన్నారు. సరిహద్దుల్లో, కొండా కోనల్లో, అటవుల్లో, ఎడారుల్లో, సముద్రంలో, ఆకాశంలో ఇలా అన్ని చోట్లా భద్రతను కల్పిస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న వీరికి (సైనికులకు) మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదన్నారు.
అగ్నిపథ్ పై మాట్లాడే హక్కు వారికి లేదు..
అగ్నిపథ్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ సైనిక శక్తిని నిరాశ పర్చాలనే ఉద్దేశంతో ఉన్నాయని మోదీ అన్నారు. అగ్నిపథ్ యోజన, సైన్యం అంటే 140 కోట్ల మంది భద్రతకు హామీ అన్నారు. ఇంత సున్నిత అంశంలో కూడా వీరు అసత్య ప్రచారాలు చేయడం వీరి అవివేకానికి నిదర్శనమన్నారు. స్వాతంత్ర్యంవచ్చి 70 యేళ్లు గడిచినా సైనికుల కోసం యుద్ధ స్మారక స్థూపం నిర్మించని వారు కమిటీలు, మ్యాప్ లతో కాలయాపన చేసే వారు సైనికుల కోసం మాట్లాడే హక్కు లేదన్నారు. సరిహద్దుల్లోని సైనికులకు నాసిరకం ఆయుధాలు, జాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న వారికి అగ్నిపథ్ పై మాట్లాడే అర్హత లేదన్నారు.
సమర్థులైన యువకులే అగ్నిపథ్ లోకి..
అగ్నిపథ్ ద్వారా దేశ సేవ కోసం తపించే సమర్థులైన యువకులు సైనిక రంగంలోకి వస్తారన్నారు. అనంతరం కూడా వీరికి అనేక రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. వీరికి పింఛన్ కూడా లభిస్తుందని మోదీ తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేశ సైనిక రంగం ముందుంటుందని తెలిపారు. దేశ యువత శక్తియుక్తులపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
రాజకీయాలు, పదవుల కోసం పాకులాడలేదు..
బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడు రాజకీయాలకు కోసం, పదవుల కోసం తపన పడలేదన్నారు. తమకు భారతదేశ సార్వభౌమాధికారం, గౌరవ, మర్యాదలు, అభివృద్ధి, శాంతి ముఖ్యమన్నారు. తమ దేశం అన్ని రంగాల్లో వృద్ధిని సాధిస్తూ ప్రపంచదేశాల్లోనే ప్రథమ దేశంగా ఉండాలనేదే తన తపన అని అన్నారు. అందుకే అనేక రంగాల్లో కీలకమైన సంస్కరణలు చేపడుతూ వృద్ధి దిశగా వెళుతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
డిఫెన్స్ రంగం 1.25 లక్షల కోట్ల ఉత్పత్తి పెరుగుదల..
డిఫెన్స్ రంగంలో పరిశోధనలు, నూతన ఆయుధాల ఉత్పత్తి 1.25 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఒకప్పుడు ఆయుధాలను దిగుమతి చేసుకుంటే ప్రస్తుతం ఆ పరిస్థితిలో పూర్తిమార్పునకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐదువేల ఆయుధాలను దిగుమతి చేసుకోవద్దని నిర్ణయించామన్నారు. భవిష్యత్ లో దేశీయంగానే ఆయుధాల రూపకల్పన జరుగుతుందన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో పెనుమార్పులు అవసరమని గుర్తించి ఈ రీతిలో భారత రక్షణ రంగాన్ని తీర్చిదిద్దుతున్నామని మోదీ అన్నారు.
లడఖ్ కు ఆరు రెట్ల ఎక్కువ బడ్జెట్..
లడఖ్ లో సింధు సెంట్రల్ యూనివర్శిటీని నిర్మిస్తున్నారని, 4జీ నెట్‌వర్క్ పనులు కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. టన్నెల్ పనులు కూడా కొనసాగిస్తున్నామన్నారు. దీంతో సరిహద్దు భద్రత మరింత పటష్ఠం అవుతుందన్నారు. లడఖ్ బడ్జెట్ ను ఆరు రెట్లు పెంచామన్నారు. విద్య, ఉపాధి, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు మోదీ తెలిపారు.
ఉగ్రవాదులను అణచివేస్తాం..
చివరగా మరోమారు తాను ఈ వేదిక ద్వారా ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులను హెచ్చరిస్తున్నానని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. వారి దుర్మార్గపు చర్యలను మానుకోకపోతే పూర్తి శక్తితో అణిచివేస్తామన్నారు. శత్రువుకు తనదైన రీతిలోనే జవాబు చెబుతామన్నారు. లడక్,జమ్మూ, కాశ్మీర్ ప్రాంతం ఏదైనా సమాధానం ఇచ్చి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
షింకున్ లా టన్నెల్..
లడఖ్ లోని 15,800 అడుగు ఎత్తులో రూ. 1681 కోట్ల వ్యయంతో 4.1 కి.మీ. మేర నిర్మించనున్నషింకున్ లా టన్నెల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ వ్యాలీని లడఖ్‌లోని జస్కర్ వ్యాలీని కలుపుతుంది. అత్యంత క్లిష్టమైన వాతావరణంలో కూడా ఈ టన్నెల్ ద్వారా రవాణా సాధ్యపడుతుంది. ఈ ప్రాజెక్టును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండేళ్లలో నిర్మించనుంది. ఈ టన్నెల్ ట్విన్ –ట్యూబ్ డబుల్ లేన్ టన్నెల్. ప్రతీ 500 మీటర్ల తరువాత క్రాస్ పాసేజ్ లు ఉంటాయి. ఈ టన్నెల్ లో వెంటిలేషన్, ఆక్సిజన్,అగ్ని మాపక, కమ్యూనికేషన్ లాంటి సదుపాయాలు ఉంటాయి.