సౌమ్యుడికి సముచిత స్థానం
A perfect place for the gentle
- ఒకే మాట.. ఒకే బాణం
- ఆది నుంచి కమలంలోనే
- ప్రజాసేవకే అంకితం
- సేవా కార్యక్రమాల చాటింపులకు దూరం
- ఒప్పించి మెప్పించే వినూత్న ధోరణితో ముందుకు
- విలక్షణ శైలితో ఉత్తరాదిలోనూ పేరు ప్రఖ్యాతులు
- మోదీ, మంత్రుల్లో ప్రత్యేక స్థానం
- సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్
సౌమ్యుడికి సముచిత స్థానం లభించింది. మోదీ కేబినెట్ లో జి.కిషన్ రెడ్డికి మరోసారి చోటు లభించింది. ఒకే మాట ఒకే బాణంలా కిషన్ రెడ్డి ఆది నుంచి బీజేపీ పార్టీలో చేరి ప్రజాసేవకై అంకితమయ్యారు. ఆయనముందు ఎంతోమంది పార్టీలోకి వచ్చినా పై చేయి సాధించలేకపోయారు. అయితే కిషన్ రెడ్డి ప్రజాసేవలో వినూత్నరీతిలో ఆలోచనా విధానమే ఆయన ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు కారణంగా నిలిచింది.
పార్టీలో చేరి సీనియర్ నాయకులతో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా ఏనాడు ఆ సీనియర్ నాయకులను మరిచిపోలేదని చాలామంది అంటుంటారు. అదే విధంగా వారికి గౌరవ మర్యాదలతో ముందుకు వెళుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమనేది అందరికీ సాధ్యపడదు అతికొద్దిమందికి తప్ప. ఆ కొద్దిమందిలో కిషన్ రెడ్డి ఒక్కరనేది చెప్పకనే చెప్పొచ్చు. ఆయన ఎదగడంతో పాటు పార్టీ ఎదుగుదలకు విశేషంగా తోడ్పాటునందించారు. అదే సమయంలో సమాజ, ప్రజా సేవలో ముందున్నారు.
ఇప్పటికీ ఆయన ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, సేవా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. అయితే సేవా కార్యక్రమాలను చాటింపు వేయడం ఆయనకు పెద్దగా నచ్చకపోవడం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పెద్దగా చాలామందికే తెలియదు. మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు, పార్టీ కార్యకర్తలకు అనేక విధాలుగా సహాయ సహకారాలందించడంలో రాష్ర్టంలో ముందువరుసలో ఉన్న నాయకుడు ఎవరైంటే ఎవ్వరైనా ఇట్టే కిషన్ రెడ్డి పేరు చెబుతారు.
ఇక తెలుగువారిగా కిషన్ రెడ్డి ఉండడంతో తెలంగాణకు అత్యంత ప్రాముఖ్యత దక్కిందనే చెప్పాలి. ఇరు ప్రాంతాల తెలుగు ప్రజల కోసం అనేక కష్టనష్టాలు ఎదురైనా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఆయన విలక్షణ ధోరణితో ముందుకు వెళుతూ అనుకున్నది సాధించుకుంటారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా చాలామంది నేతల్లా కాకుండా కిషన్ రెడ్డి విమర్శల ధోరణి సుతిమెత్తగా ఉంటుంది. ఎదుటివారిని నొప్పించక, తానొవ్వక అనే విమర్శల విధానం ప్రతిపక్షాలను కూడా చాలాసార్లే ఆలోచింప చేస్తుంది. అందుకే చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా కిషన్ రెడ్డి అంటే ఇష్టపడుతుంటారు. విమర్శల విధానంలో ఏనాడు వ్యక్తిగతంగా వెళ్లరు. అందుకే ప్రతిపక్షాలు కూడా ఆయన పూర్తి పరిణితి చెందిన నాయకుడని చెబుతుంటాయి.
కేంద్రంలోని బీజేపీ పెద్దలకు, ఆయా హిందీ ప్రాంతాల నాయకులు కూడా కిషన్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. కిషన్ రెడ్డి మాటతీరు నిదానమే ప్రదానం అన్నట్లుగా ఉండటం. వారికి తెలంగాణ, ఆంధ్రప్రాంతాలలో ఏదైనా అవసరం వస్తే ఈయన్నే సంప్రదిస్తుంటారు. అలా స్నేహభావాన్ని చాటుకోవడంతో ఉత్తరాది నాయకులతో కూడా కిషన్ రెడ్డికి అంతే గౌరవం, మర్యాదలు లభిస్తుంటాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఇలా ఒక్కరని ఏం చెప్పేది బీజేపీ మంత్రి వర్గమంతా కిషన్ రెడ్డి అంటే ఇష్టపడని వారుండరు. ఆయన తనకంటూ ప్రత్యేకంగా వీరిని ఏం కోరరు. కానీ రాష్ర్టం తరఫున ఏదైనా సమస్యను వారి దృష్టికి చేరిస్తే ఇట్టే పరిష్కరిస్తారు.
ఇంతింతై వటుడింతై అన్న చందంగా కిషన్ రెడ్డి ఆది నుంచి ఒకే పార్టీలో ఉండడం, ప్రజాసేవలో నిమగ్నవడం, కార్యకర్తలు కాపాడుకోవడం, తోటి నాయకును గౌరవించడం, కేంద్ర నాయకులతో ముందుచూపుతో వ్యవహరించడం, భవిష్యత్ ప్రణాళికలు, సూదుర లక్ష్యాలు తదితరాలతో కిషన్ రెడ్డి ఎదగడం సంతోషకరం, ఆనందదాయకం, అభినందనీయం. మరోసారి కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి చోటు లభించడం హర్షణీయం.