పీఓకే ప్రజలు స్వచ్ఛందంగా చేరాలి
యువత ఆలోచనలో మార్పు తీసుకువచ్చాం
జమ్మూకశ్మీర్ ఎన్నికలపై ప్రపంచవ్యాప్త దృష్టి
వాల్మీకి, ఎస్టీల డిమాండ్ లు నెరవేరాయి
జీ–20ని విజయవంతంగా నిర్వహించాం
పీఓకే విదేశీ భూమి అని పాకే పేర్కొంది
సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టో
రాంబన్ ఎన్నికల సభలో మంత్రి రాజ్ నాథ్ సింగ్
శ్రీనగర్: పీఓకే (పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్) నివాసితులు స్వచ్ఛందంగా భారత్ లో చేరాలని వారిని తమ సొంతవారిగానే భావిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్ లోని రాంబన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు.
జమ్మూకశ్మీర్ యువత ఆలోచనా రీతిలో మార్పు వచ్చిందన్నారు. రాళ్లు, తుపాకుల కు బదులు ప్రస్తుతం యువత చేతిలో ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్లు ఉన్నాయన్నారు. యువత విద్య, ఉపాధిపై వినూత్నంగా ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. బీజేపీ ఉన్నంత కాలం 370ని ఎవ్వరూ పునరుద్ధరించలేరన్నారు.
ఇక్కడ జరగబోయే ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమై ఉందన్నారు. ఇక్కడి యువతలో మార్పు రావడాన్ని చాలామంది నిపుణులు స్వాగతిస్తున్నారన్నారు. మరోమారు మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వాలను గద్దె నెక్కిస్తే తిరిగి అశాంతి తప్పదన్నారు. జమ్మూకశ్మీర్ లో ఎంతోకాలంగా ప్రజల హక్కులు హరించారని ఆరోపించారు. ఈసారి శరణార్థులు, వాల్మీకి సంఘం, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును పొందారని సంతోషం వ్యక్తం చేశారు.
వాల్మీకి సంఘం, ఎస్టీల డిమాండ్లు నెరవేరాయన్నారు. కశ్మీర్ లోయలో మార్పును స్పష్టంగా గమనిస్తున్నామన్నారు. జీ–20 శ్రీనగర్ లో విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.
ఉగ్రవాదం అనే పేరున్న జమ్మూకశ్మీర్ ను పూర్తిగా మారుస్తూ శాంతికి నిలయంగా మార్చగలిగామన్నారు. దశాబ్దాల తరబడి హింసకు ఫుల్ స్టాప్ పెట్టామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
పీఓకేని విదేశీ భూమిగా పాక్ ఏఎస్జీ స్వయంగా అఫిడవిట్ లో పేర్కొందని తెలిపారు. భారత్ పీఓకే ప్రజలను కూడా తమ వారిగా భావిస్తోందని వారు స్వచ్ఛందంగా తమతో కలిస్తే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను వారికి కూడా సమానంగా అందజేస్తామని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.
ఏడాదికి రెండు సిలీండర్లు, విద్యార్థులకు ట్యాబెట్లు, ల్యాప్ ట్యాప్ లు, మెట్రో కనెక్టివిటీ, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందిందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని జమ్మూకశ్మీర్ బంగారు భవితకు మరిన్ని బాటలు వేసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.