మూడుసార్లు రాష్ర్టపతి పాలన
ఆదివాసీల ప్రాబల్యం, సరిహద్దు రాష్ర్టాల ప్రభావం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బిహార్ తో ఝార్ఖండ్ వేరు పడ్డాక ఇక్కడ గత నాలుగుసార్లుగా నిర్వహిస్తున్న ఎన్నికలలో ఏ పార్టీ పూర్తి మెజార్టీ సాధించలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఇక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండనున్నాయనే ఆలోచనలో అందరిలో మెదలుతుంది. 2005 నుంచి 2019 వరకు నాలుగు సార్లు ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ మూడుసార్లు రాష్ర్టపతి పాలన కూడా విధించడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో 2.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈసారైనా ఓటర్లు వార్ వన్ సైడ్ అనే తీర్పునిస్తారా? లేదా గతంలో లాగే ఎవ్వరికీ పూర్తి మెజార్టీ ఇవ్వరా? అనే టెన్షన్ నెలకొంది.
అయితే అధికార హేమంత్ సోరెన్ (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. సీఎం హేమంత్ సోరెన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లడం, చంపై సోరెన్ ను సీఎం చేయడం, అటు పిమ్మట రాజీనామాతో జేఎంఎంకు ఈసారి ఆశించిన స్థాయిలో సీట్లు లభించకపోవచ్చని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్డీయే కూటమిలో బీజేపీ, ఎజెఎస్ యూ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలున్నాయి.
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలున్నాయి. 2004లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 30 స్థానాలను, 2014లో 37 స్థానాలను, 2019లో 25స్థానాలను సాధించింది. ఝార్ఖండ్ ను భౌగోళికంగా చూసుకుంటే ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ రాష్ర్టంతో సరిహద్దును పంచుకుంటున్న బిహార్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, ఒడిశా వంటి సరిహద్దు రాష్ర్టాల ప్రభావ కూడా ఉండనుంది. దీంతో సీట్ల సమీకరణాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుండగా, అధికార జెఎంఎం పార్టీ 41 స్థానాలలో పోటీ చేస్తుంది.