నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 45వ చెస్ ఒలింపియాడ్ బుడాపెస్ట్ లో స్వర్ణం సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బుధవారం వీరితో తన నివాసంలో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. 45వ ఎఫ్ ఐడీఈ చెస్ ఒలింపియాడ్ ను గెలుచుకోవడం దేశానికి గర్వకారణమన్నారు. పురుషులు, మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ అద్భుత విజయంతో క్రీడాపథంలో నూతనాధ్యాయాన్ని సూచిస్తుందని ప్రధాని తెలిపారు.
ఆటతీరును విజేతలను అడిగి తెలుసుకున్నారు. అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద, డి. గుకేశ్, విదిత్, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణ్ లను అభినందించారు. హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్, అభిజిత్ కుంటే (కెప్టెన్)లతో కూడిన భారత మహిళల జట్టు 45వ చెస్ ఒలింపియాడ్‌లో కజకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలను అధిగమించి స్వర్ణం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.