దేశ రాజధానిపై కమలం పాగా
A lotus spread over the national capital
ఆప్ కు అవినీతి మరకలు
ప్రతిష్ఠ మసకబారింది
ఎంపీ ఎన్నికల్లో కమలం హవా
అదే దిశలో 2025 అసెంబ్లీ తీర్పు?
మద్యం పాలసీలో జైలు – బెయిలు
రాజీనామాల పరంపర, పలువురు నేతల గుడ్ బై
ఢిల్లీపై పట్టుబిగించేందుకు పరివర్తన్ యాత్రతో సిద్ధమైన కమలదళం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: గత ఐదేళ్లలో ఆప్ కు అవినీతి మరకలు భారీగానే అంటుకున్నాయి. ఫిబ్రవరి 2025లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఆ పార్టీ రెండు జాబితాలను విడుదల చేసి మొత్తం 31 మంది పేర్లను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. అన్ని పార్టీలు తమ తమ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆప్–బీజేపీల పేర్లే ప్రముఖంగా వినిపిస్తుండగా, ఆప్ నేతలకు అవినీతి మరకలంటుకోవడం ఏకంగా జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి రావడం కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపునున్నారో? అనే విషయం ఎన్నికల అనంతరమే తేలనుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ కు 62, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఆప్ కు 53.57 శాతం ప్రజామద్ధతు లభించగా, బీజేపీకి తక్కువ సీట్లైనా 40.57 శాతం ప్రజామద్ధతు లభించింది. అటుపిమ్మట ఈ నాలుగేళ్లలో జరిగిన పరిణామాలతో ఆప్ ప్రతిష్ఠ మసకబారింది. ఈసారి కమలం ఓట్ల శాతం భారీగా పెరగనుందనే వాదనలున్నాయి.
ఆప్ నేతల అవినీతి..
సీఎంగా ఉండగానే ఢిల్లీ మద్యంపాలసీ అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. జైలు నుంచే పాలన కొనసాగించారు. చివరకు బెయిల్ వచ్చాక అతిశిని సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. ఈ కేసులో 15 మంది నిందితులపై కేసు నమోదైంది. పీఎంఎల్ ఎ కింద మనీలాండరింగ్ కింద కూడా కేసు నమోదైంది.
ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హిందూ దేవతలపై విమర్శలు గుప్పించడంతో దేశ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. పదవికి రాజీనామా చేశారు. అటుపిమ్మట ఆయన హస్తం పార్టీలో చేరారు.
మరో ఆప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ ను ఈడీ మద్యం పాలసీ కేసులో అరెస్టు చేసింది. ఈయతోపాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుకు పంపింది. ఈ ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
మద్యం పాలసీ కుంభకోణంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆప్ మంత్రి రాజ్ కుమార్ పార్టీకి బైబై చెప్పారు. బీఎస్పీలో చేరారు. అటు పిమ్మట బీజేపీలో చేరారు.
2024 ఢిల్లీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆప్ పొత్తు పెట్టుకున్నా మొత్తం ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో భారీ ప్రచారానికి కూడా తెరతీసినా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు.
అనంతర పరిణామాల్లో సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, అరవింద్ కేజ్రీవాల్ లు బెయిల్ పై బయటికి వచ్చారు.
ఆప్ కు మరో కీలక నేత గుడ్ బై కొట్టారు. కైలాష్ గెహ్లాట్ బీజేపీ చేరి తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి కూడా రాజీనామా చేశారు.
భారీ అవినీతి మరకలతో ఆప్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా, హామీల వరాలు గుప్పిస్తున్న లోక్ సభ ఎన్నికల ప్రజా తీర్పును పరిశీలిస్తే ఈసారి దేశ రాజధానిలో కమలం (బీజేపీ) వికసించనుందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకటి, రెండూ కాదు ఏకంగా ఏడు ఎంపీ సీట్లలో బీజేపీ విజయం సాధించడమంటే ఆషామాషీ కాదు. ఇది మొత్తం ఢిల్లీ ప్రజల తీర్పును వెల్లడిస్తుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్–ఆప్ ఒక్కటైనా ప్రజలు వీరిని తిరస్కరించారు.
అదే సమయంలో, ఢిల్లీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ప్రకటించింది. ఇప్పుడు సహించబోం, మారతాం’ అని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్లోగన్ ఇచ్చింది. ఈసారి ఢిల్లీలో పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మురికివాడల నివాసితులకు శాశ్వత ఇళ్లు ఇస్తామని ఢిల్లీ బీజేపీ పేర్కొంది. బీజేపీ కూడా పరివర్తన్ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో డబుల్ ఇంజన్ ప్రభుత్వ ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.