విద్యార్థి దారుణ హత్య

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి సంఘాలు ఆర్డీవో హామీతో విరమణ

Sep 22, 2024 - 16:23
 0
విద్యార్థి దారుణ హత్య
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్​ జిల్లా మావల పోలీస్​ స్టేషన పరిధిలో జరిగిన బీఎస్సీ విద్యార్థి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు రోడ్డుపై బైఠాయించడంతో మరింత ఉద్రిక్తతలకు కారణమవుతోంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్​ రెడ్డి, ఆదిలాబాద్​ రూరల్​ సీఐ ఫణిధర్​, ఎస్​ ఐ విష్ణువర్ధన్​ లు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింప చేసేందుకు ప్రయత్నించారు. 
 
నార్నూర్​ మండలంలోని చోర్​ గావ్​ కు చెందిన రాథోడ్​ ధనిసింగ్​, మీరాబాయి దంపతులు మూడో కుమారుడు రాథోడ్​ జితేందర్​. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో బీఎస్సీ విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడితో మాట్లాడి హాస్టల్​ లోకి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని తీసుకువెళ్లారు. బలవంతంగా మద్యం తాగించి సీసాతో జితేందర్​ ఛాతీ, తల, కాళ్లు, శరీర భాగాలపై దారుణంగా పొడిచి హత్య చేశారు. విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న బంధువు నగేష్​ జితేందర్​ ను రిమ్స్​ కు తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి శనివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఉద్రిక్తతలకు కారణమైంది. విద్యార్థి హత్యపై హాస్టల్​ వార్డెన్​, అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడి హామీ ఇచ్చాక ఆందోళన విరమించారు. 
 
ఈ ఆందోళనలో ఆదిలాబాద్​ లంబాడీ జేఏసీ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు భారీ ఎత్తున జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.