తాత్కాలిక ముసుగులో కబ్జాకు స్కెచ్​

Sketch of possession under temporary cover

Sep 22, 2024 - 16:01
 0
తాత్కాలిక ముసుగులో కబ్జాకు స్కెచ్​
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ ఏరియా సింగరేణి సంస్థకు చెందిన విలువైన స్థలాలు తాత్కాలిక షెడ్ల నిర్మాణం పేరిట కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాకు గురైన స్థలాలల్లో సింగరేణి అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ విలువైన స్థలాలు కావడం చేత అక్రమార్కులు సూచిక బోర్డులను సైతం రాత్రికిరాత్రే మాయం చేస్తున్నారు. ఇదే క్రమంలో రామకృష్ణాపూర్ సూపర్ బజార్ నుంచి ఠాగూర్ స్టేడియానికి వెళ్లే రహదారి పక్క స్థలాన్ని కబ్జా చేసే పనిలో భాగంగా షెడ్ ముసుగులో సమాజంలో పేరున్న వ్యాపారదారులు కొందరు ప్రహారీ నిర్మాణాలు మొదలుపెట్టగా సింగరేణి ఎస్టేట్​, ఎస్​ అండ్​ పీసీ (సెక్యూరిటీ)సిబ్బంది అడ్డుకున్నారు. మొదలుపెట్టిన నిర్మాణం పనులు అపివేయాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
ఛాలెంజ్ గా తీసుకున్న వ్యాపారదరులు రాత్రిరాత్రే రోడ్డు పక్క ఆలయ ప్రహరీ నిర్మాణం, గేటు ఏర్పాటు చేసి అటు అధికారులను, ఇటు పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేశారు. అక్రమంగా స్థలాన్ని అక్రమించేందుకు మతరాజకీయనికి కూడా తెర లేపేందుకు ప్రయత్నాలు జరిగినట్లు పలువురు విజ్ఞానవంతులు కూడా బహిరంగంగానే చర్చించుకున్నారు. స్థలాలు ఆక్రమణలు జరుగకుండా చూసే సింగరేణి అధికారులు కూడా నామమాత్రంగా రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి, రెండు మార్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకునే పని చేయగా కబ్జాదారులు మాత్రం అదే పనిగా స్థానిక రాజకీయ నాయకులను మధ్యవర్తులుగా మల్చుకుని కార్పొరేట్ ఉన్నతాధికారులతో మంతనాలు చేస్తూ ఇపుడు కేవలం తాత్కాలి కమని చెబుతూ శాశ్వత నిర్మాణాలు చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. 
 
ఆక్రమణ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని ఓ హార్డ్ వేర్ షాప్ యజమాని సంఘంలోని పలువురికి డబ్బును ఎరగా చూపుతున్నట్లు తెలుస్తుంది. కబ్జాల విషయం సింగరేణి విజిలెన్స్ అధికారుల దృష్టిలో ఉన్నపటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు. సింగరేణి స్థలం కబ్జాదారుల కబంధ హస్తాలకు చిక్కుతుందా లేక సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుంటుందా వేచిచూడాలి.