కాంగ్రెస్​, ఆర్జేడీలు అవినీతి పార్టీలు సంపదను తరలించేందుకు 70 ట్రక్కులు

చిరాగ్​ కు ఓటేసి రామ్​ విలాస్​ పాశ్వాన్​ ఆత్మకు శాంతి చేకూర్చాలి బిహార్​ లో విధ్వంసక పాలన కొనసాగించారు హాజీపూర్​ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 13, 2024 - 12:12
 0
కాంగ్రెస్​, ఆర్జేడీలు అవినీతి పార్టీలు సంపదను తరలించేందుకు 70 ట్రక్కులు

పాట్నా: అవినీతి అక్రమాలకు కాంగ్రెస్​, ఆర్జేడీలు కేరాఫ్​ గా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుపేదల సంపదను దోచుకోవడంలో ఆ పార్టీకి చెందిన నాయకులు తొలివరుసలో ఉన్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.2200 కోట్లకు పైగా దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయని తెలిపారు. 

ఐదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హాజీపూర్​ లో  పాశ్వాన్​ కు మద్దతుగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్​, ఆర్జేడీలపై విరుచుకుపడ్డారు. వీరి అవినీతి డబ్బును తరలించడానికే 70 ట్రక్కులను వాడాల్సి వచ్చిందని ప్రధాని విమర్శించారు.

చిరాగ్​ పాశ్వాన్​ కు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని అప్పుడే రామ్​ విలాస్​ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.గతం కంటే ఎక్కువ ఓట్లను వేసి పాశ్వాన్​ ను గెలిపించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. 

చిరాగ్​ పాశ్వాన్​ అంటే తనకు చాలా ఇష్టం, గౌరవమన్నారు. ఏ మాత్రం గర్వం లేని వ్యక్తులలో ఈయన ఒకరని తన తోబుట్టువులా భావిస్తానని అన్నారు. ఇతనితో తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కొనియాడారు.

కాంగ్రెస్​, ఆర్జేడీల పాలనలో బిహార్​ రాష్ర్టం పూర్తి విధ్వంసానికి గురైందన్నారు. అభివృద్ధి అనే మాటనే లేదన్నారు. పైగా ఇక్కడికి వచ్చిన పరిశ్రమ వర్గాలను భయపెట్టి ఆ పరిశ్రమలు కాస్తా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. మారుమూల ప్రాంతాల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎన్నికలప్పుడు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాయని మండిపడ్డారు.

కాంగ్రెస్​, ఇండి కూటమికి ఓటు వేయడమంటే దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని ప్రధాని మోదీ విమర్శించారు.

బీజేపీ ట్రాక్​ రికార్డును పరిశీలించాలన్నారు. దేశ హితమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా, నిరుపేదల సేవే పరమావధిగా గత పదేళ్లు పనిచేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. హిందువుల భగవంతుడిని, రిజర్వేషన్ల పేరుతో కుట్రలకు తెరలేపే వారిని ప్రజలు తిరస్కరించాలని మరోమారు సుభిక్ష పాలనకు నాందీ పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.