విరిగిపడుతున్న కొండచరియలు
బిహార్ లో ప్రభావం
వరదలో చిక్కుకున్న 26 జిల్లాలు
కాట్మాండు: నేపాల్ లో వర్షాలు తగ్గుముఖం పడుతున్నా వరదలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడంతో సోమవారం వరకు 200మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 42 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడుతుండడంతో రెస్క్యూ బృందాలు నాలుగువేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నేపాల్ ఆర్మీ 162 మంది రంగంలోకి దిగి రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. పాఠశాలలకు మూడురోజులపాటు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. కాట్మాండులో ఝాప్లే, భాగ్మతి నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 56 జిల్లాలు నీట మునిగాయి. కాగా ఆసియాలో గ్లోబల్ వార్మింగ్ వల్లే వాతావరణ మార్పులకు, ఆకస్మిక వర్షాలు, వరదలకు కారణమవుతోందని శాస్ర్తవేత్తలు తెలిపారు.
నేపాల్ వరదలు బిహార్ లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. పలుజిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బిహార్ లో గంగా, కోసి, గండక్ తో సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బీర్పూర్ బ్యారేజ్ 56 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గండక్ నది 36 గేట్లను తెరిచారు. బిహార్ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. బిహార్ లోని 26 జిల్లాల్లో 30 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు.