ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్ 18 మంది మావోలు మృతి
టాప్ కమాండర్ శంకర్ రావు హతం వివరాలు వెల్లడించిన ఎస్పీ
రాయ్ పూర్: భద్రతా బలగాలు నక్సలైట్లకు మధ్య మంగళవారం చోటు చేసుకున్నకాల్పుల్లో 18 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు సమాచారం. ఎస్పీ కళ్యాణ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎన్ కౌంటర్ సందర్భంగా డజనుకు పైగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మృతదేహాల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మంగళవారం వేకువజామున నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ లో నక్సల్ టాప్ కమాండర్ శంకర్ రావు కూడా హతమైనట్లు ఎస్పీ తెలిపారు. శంకర్ రావుపై ఇప్పటికే రూ. 25 లక్షల రివార్డు ఉందని ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా ఇద్దరు జవాన్లు కూడా హతమయ్యారని పేర్కొన్నారు.
ఇంకా ఛోటే బెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాద్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ కొనసాగుతోందని వివరించారు. అటవీ ప్రాంతంలో గాయపడిన సైనికులను రక్షించేందుకు అదనపు బలగాలను రప్పించామని తెలిపారు.
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో ఎన్నికల సందర్భంగా కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సాయుధ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ ఆర్మీకి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 18 మంది నక్సల్స్ మృతి చెందిన వార్త దావనంలా వ్యాపించడంత ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య గ్రామీణులు, గిరిజనులు తీవ్ర భయాందోళనల్లో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు.
కాగా ఎన్ కౌంటర్ ను కాంకేర్ ఎస్పీ ఐకే అలిసెలా ధృవీకరించారు. భారీ మొత్తంలో ఆయుధాలు లభించాయన్నారు. నక్సల్స్, సాయుధ దళాలాలకు సంబంధించిన ఎన్ కౌంటర్ మరింత మంది మృతి చెంది ఉండే అవకాశం ఉందన్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలలో మరిన్ని భద్రతా దళాలను మోహరించి సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామన్నారు.