ఇరాన్​ పై దాడికి సిద్ధం ఐదోసారి నెతన్యాహు హై లెవెల్​ మీటింగ్​

ఇరాన్​ పై ఆంక్షలకు అమెరికా సిద్ధం ఉద్రిక్తతలు తగ్గించేందుకు మరోసారి ప్రయత్నం భారతీయులను కలిసిన అధికారులు?

Apr 16, 2024 - 17:58
 0
ఇరాన్​ పై దాడికి సిద్ధం ఐదోసారి నెతన్యాహు హై లెవెల్​ మీటింగ్​

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​ పై 300 క్షిపణులతో ఇరాన్​ దాడుల అనంతరం ప్రధాని నెతన్యాహు అత్యవసరంగా ఐదోసారి అధికార, సైనిక, పాలనా యంత్రాంగంతో మంగళవారం భేటీ నిర్వహించారు. అందరి సూచనలు సలహాలు దాడులకు ప్రతిజవాబు చెప్పాలని భేటీలో నిర్ణయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సిరియాలోని ఇరాన్​ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్​ దాడి అనంతరం ఇరాన్​ ప్రతిస్పందించి దాడికి దిగింది. అయితే ఇజ్రాయెల్​ దాడి చేస్తుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం మీడియా వెల్లడించలేదు. నెతన్యాహు వార్​ రూమ్​ లో రహాస్యంగా ఈ భేటీని నిర్వహించినట్లు వెల్లడించాయి. భేటీ సందర్భంగా పలువురు కేబినెట్​ ర్యాంక్​ మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. 
మరోవైపు ఇరాన్​–ఇజ్రాయెల్​ లలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్​ కు అమెరికా, నాటోదేశాలు తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉద్రిక్తతలను నిలిపివేసేందుకు తమ మొదటి ప్రయత్నం ఉంటుందని కూడా స్పష్టం చేశాయి. 

అయితే మరోమారు ఇజ్రాయెల్​ పై దాడికి పూనుకుంటే మాత్రం ఇరాన్​ పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్​ లోనూ హై లేవెల్​ భేటీ జరిగింది. ఈ భేటీలో యూఎస్​ ట్రెజరీ సెక్రెటరీ జానెట్​ యెల్లెన్​ కూడా పాల్గొన్నారు. ఇరాన్​ పై పరిమితులకు సంబంధించిన ఆంక్షలు విధించనున్నట్లు పలువురు అధికారులు పేర్కొన్నారు. అయితే దేనికి సంబంధించిన పరిమితులనేది తెలియజేయలేదు.

ఇరాన్​ ఓడలో 17 మంది భారతీయులు..

ఇరాన్​ స్వాధీనం చేసుకున్న ఓడలో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. భారత్​ దౌత్య విధానాల వల్ల భారతీయులను కలిసేందుకు ఇరాన్​ ఓకే చెప్పింది. అయితే అధికారులు భారతీయులను సోమవారం కలిసినట్లు తెలిసినా అందుకు సంబంధించిన సమాచారం రహాస్యంగానే ఉంచారు.