కువైట్​ అగ్నిప్రమాదం.. కేరళకు భౌతికకాయాలు

గాయపడ్డ వారికి అత్యాధునిక వైద్యానికి ఏర్పాట్లు మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి సురేశ్​ గోపీ విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కీర్తి వర్ధన్​ సింగ్​

Jun 14, 2024 - 13:23
 0
కువైట్​ అగ్నిప్రమాదం.. కేరళకు భౌతికకాయాలు

తిరువనంతపురం: కువైట్​ మంగాఫ్​ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 45 మంది భారతీయులను శుక్రవారం కేరళకు తీసుకువచ్చారు. గురువారం డీఎన్​ఏ పరీక్షల అనంతరం రాత్రి వైమానిక దళ ప్రత్యేక విమానం సీ 130–జెలో మృతదేహాలను కేంద్రమంత్రి కీర్తివర్ధన్​ సింగ్ తీసుకొని వచ్చారు. శుక్రవారం ఉదయం ఈ విమానం కేరళకు చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళకు చెందిన వారు కాగా, తమిళనాడు 7, ఆంధ్ర, యూపీ ఒక్కొక్కరు, బిహార్​, ఒడిశా, కర్ణాటక, మహారాష్ర్ట, ఝార్ఖండ్​, హరియాణా, పంజాబ్​, పశ్చిమ బెంగాల్​ లకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. అయితే అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది చనిపోగా అందులో ఫిలిప్పిన్స్​, నేపాల్​, పాక్​, ఈజిప్ట్​ కు చెందిన వారు కూడా ఉన్నారు. 

కేరళ విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి సురేశ్​ గోపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందని గోపీ ప్రకటించారు. 

అనంతరం సీఎం పినరయి విజయ్​ కూడా విమానాశ్రయానికి చేరుకొని మృతులకు నివాళులర్పించారు.

కేంద్రమంత్రి కీర్తివర్ధన్​ సింగ్​ గాయపడ్డ భారతీయులను పరామర్శించారు. వారి చికిత్సకు అయ్యే అన్ని ఏర్పాట్లను చేశారు. కువైట్​ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకొని వెంటనే చర్యలకు ఉపక్రమించారు. దీంతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం లభిస్తోంది. మృతదేహాలను త్వరగా భారత్​ కు తీసుకురాగలిగారు. ఏది ఏమైనా ఈ సంఘటన అత్యంత బాధాకరమని కేంద్రమంత్రి కీర్తివర్ధన్​ సింగ్​ విచారం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయుల సురక్షిత బాధ్యతలను కూడా తీసుకుంటామని మోదీ నేతృత్వంలో చర్యలకు కట్టుబడి ఉంటామని మంత్రి ప్రకటించారు.