హస్తినలో నీటి సంక్షోభం యమునా బోర్డుతో తేల్చుకోవాలి
తామేం నిపుణులం కాదన్న సుప్రీం వెంటనే సమావేశం కావాలని బోర్డుకు ఆదేశం ట్యాంకర్ మాఫియాపై చర్యలు.. ప్రభుత్వంపై ఆగ్రహం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో సుప్రీం చేతులెత్తేసింది. తామేమీ నీటి సంక్షేమ బోర్డు నిపుణులం కాదనిపేర్కొంది.ఈ సమస్య పరిధిలోకి వచ్చే యమునా బోర్డును ఆశ్రయించాలని కుండబద్ధలు కొట్టింది.ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని హిమాచల్ ప్రదేశ్, హరియాణా నుంచి నీటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ లు దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపడుతూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దీంతో ఢిల్లీకి నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. యమునా జలాల పంపిణీ విషయం ఇరు రాష్ట్రాల సంక్లిష్ట సమస్యగా పేర్కొంది. శుక్రవారం ఇరు ప్రాంతాల అధికారులతో యమునా బోర్డు సమావేశం కావాలని, త్వరలో నిర్ణయం తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. కాగా ఈ విషయంపై బోర్డుకు వెంటనే ఢిల్లీ ప్రభుత్వం దరఖాస్తు సమర్పించాలని తెలిపింది. నీటి విడుదల కోసం అవసరం అయితే రోజువారీ బోర్డు సమావేశాలను కూడా నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు ట్యాంకర్ మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం తలంటింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పోలీసులకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.