దోచుకున్నోడికి దోచుకున్నంత క్వారీలల్లో చెలరేగుతున్న ఇసుక మాఫియా!

నిబంధనలు నిల్ వసూళ్లు ఫుల్! పత్తాలేని టీఎస్​ఎండీసీ సిబ్బంది!

Jun 13, 2024 - 14:46
 0
దోచుకున్నోడికి దోచుకున్నంత క్వారీలల్లో చెలరేగుతున్న ఇసుక మాఫియా!

నా తెలంగాణ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని క్వారీలలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమర్కులకు ఇక్కడి ఇసుక  కాసుల వంట పండిస్తోంది. ప్రశ్నించి చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో ఇసుకాసురులు ప్రకృతి వనరు అయిన ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇష్టారాజ్యంగా అందినకాడికి దోచుకొని  జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమ సంపాదనకు బరితెగిస్తున్నారు. కనీసం వారిని ఇదేంటని అని ప్రశ్నించే అధికారులు కాని అడ్డుకునే వారు లేకపోవడం వారికి మరింత కలిసి వస్తోందని చెప్పవచ్చు. అప్పుడప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడే ఒక్కటి రెండు రోజులు మారినట్టు నటించి మళ్లీ యదావిధిగా అదే దందాకు శ్రీకారం చుడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆగని ఇసుక మాఫియా..

మహాదేవపూర్ మండలంలోని పలు క్వారీలలో ఇసుక మాఫియా సిరులు కురిపిస్తోంది. కాంట్రాక్టర్లతో సంబంధిత అధికారులు కుమ్మక్కై బకెట్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వారీలను టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరు సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. క్వారీలలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో ఇసుకాసురుల అక్రమ దందాకు తిరుగులేకుండా పోతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మౌనం వహిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

నిబంధనలు నిల్.. వసూళ్లు ఫుల్..

ఇసుక రీచ్​ లో నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. క్వారీలో ఇసుక లోడింగ్​ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారుల కన్నుగప్పి ఒక్కో లారీకి లోడింగ్​ కు మించి అదనపు బకెట్లు వేస్తూ ఒక్కో బకెట్ కి రూ.2వేల నుంచి 3 వేల వరకు వసూళ్లు చేస్తూ లోడింగ్​ చార్జీలు తీసుకొంటున్నారని తెలుస్తోంది. అంటే ఒక్కో క్వారీకి సుమారు వంద లారీలు వస్తే ఎంత అక్రమార్జనకు తెగబడుతున్నారో ఊహించుకోవచ్చు. 

పత్తాలేని టీఎస్ఎండిసి సిబ్బంది..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంబంధిత టీఎస్ఏండీసీ ఇసుక రీచ్ లలో లోడింగ్ దగ్గర ఉండాలని వారిని నియమించారు. కానీ ఇసుక రీచ్​ ల వద్ద వారి జాడే కనిపించడం లేదనే విమర్శలున్నాయి. డ్రెస్​ కోడ్​ తో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కాస్త డ్రెస్​ కోడ్​ లేకుండా అక్రమార్కుల నుంచి అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించకపోవడం వెనుక మర్మం ఏమై ఉంటుందని, దీని వెనుక వారికి వాటాలున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.