ఏజెన్సీ నిరుద్యోగుల ఆవేదన
స్థానికతకు గండికొట్టే ప్రయత్నాలు
సాధన సమితి ఏర్పాటు
27న డీఎస్సీ సాధన సమితి భారీ ఆందోళనకు సిద్ధం
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఏజెన్సీ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత 12 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా పాలకులు కనికరించడం లేదు. తమ భవిష్యత్ కు భరోసా ఇచ్చే విధంగా కొత్త సర్కారు దృష్టికి తమకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 అధికరణ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిమ గిరిజనులకు దక్కాల్సిన అన్ని హక్కులు తమకే అందేలా చూడాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో జీవో 3ను ఉల్లంఘించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆదిమ గిరిజనులకు అన్యాయం జరిగేలా ఉద్యోగాలు ఇస్తున్నారని దీన్ని సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆందోళనకు ఆదిమగిరిజనులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రత్యేక డీఎస్సీ కోసం..
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీతో పాటు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, ఖమ్మం జిల్లా
కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఆదిమ గిరిజనుల కుటుంబాల నిరుద్యోగ యువత జేఏసీగా ఏర్పాటయ్యారు. వీరంతా ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు 29 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను గుర్తించి వెంటనే అర్హులైన ఆదిమ గిరిజన విద్యార్థులతో భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఆదిమ గిరిజనుల కుటుంబాలను విద్యార్థులను గత పాలకులు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దం పైగా తమకు జరిగిన అన్యాయాన్ని నిరసన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే నిరుద్యోగ ఆదిమ గిరిజన డీఎస్సీ సాధన సమితి పేరుతో రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన జేఏసీ ఏర్పాటు అయింది.
జీవో 3 సవరణకు కేంద్రంపై ఒత్తిడి..
జీవో 3 ప్రకారం ఆదిమ గిరిజనులకు మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించాలన్న నిబంధనలు ఉండేవి. దీనిపై ఏజెన్సీ ప్రాంతాల్లో వలస వచ్చిన వారితో పాటు గిరిజనేతర వర్గాలు సుప్రీంకోర్టు ద్వారా ఏజెన్సీ లో ఉన్న ఉద్యోగాలను తమకు కాకుండా చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా సవరించే డిమాండ్ తో ఆందోళనకు ఆదిమ గిరిజన డీఎస్సీ సాధన సమితి ప్లాన్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ ఆదిమ గిరిజనులకు దక్కేలా ఈ జేఏసీ ఆందోళనకు సిద్ధం అవుతుంది.
27న బంద్ కు పిలుపు..
కాగా ఏజెన్సీలో దశాబ్దానికి పైగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎదురు చూస్తున్న ఆదిమ గిరిజన యువత విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా ఈనెల 27న ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛంద బంద్ కు పిలుపునిచ్చారు. సామరస్య వాతావరణంలో అన్ని వర్గాలు బంద్ కు సహకరించి ఆదిమ గిరిజన విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారని ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ఉద్దేశంతో బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ వెల్లడించింది.