పీఎస్ బీల్లో 11 శాతం వృద్ధి ఆర్థిక మంత్రిత్వ శాఖ
11 percent growth in PSBs Ministry of Finance
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 2024–25 ప్రథమార్థంలో 11 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయని ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమార్థంలో వృద్ధి రూ. 236.04 లక్షల కోట్లుగా ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేపట్టిన బ్యాంకింగ్ సంస్కరణలతో వృద్ధిరేటు సాధ్యమయ్యిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్‌హాన్స్ యాక్సెస్, సర్వీస్ ఎక్సలెన్స్, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ కోడ్ అమలు చేయడం, బలమైన గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడం వంటివి బ్యాంకింగ్ రంగ వృద్ధికి ఊతం ఇచ్చాయన్నారు. ఈ చర్యలు స్థిరమైన ఆర్థిక ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగం మొత్తం పటిష్టతకు దారితీశాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగైందని ఆర్థిక శాఖ స్పష్టం చేసిది. గ్లోబల్ క్రెడిట్ పోర్ట్‌ఫోలియో 12.9 శాతం, డిపాజిట్ పోర్ట్‌ఫోలియో సంవత్సరానికి 9.5 శాతం పెరిగిందని తెలిపారు. పీఎస్‌బీలు, ఏఐ, క్లౌడ్, బ్లాక్‌చెయిన్ వంటి నూతన -యుగం సాంకేతికతలను స్వీకరించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయన్నారు. అదే సమయంలో సైబర్ భద్రతను మరింత పటిష్ఠం చేసి ఆర్థిక వ్యవస్థలను నియంత్రణలో ఉంచామన్నారు.