జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి

సీఎం రేవంత్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి 

Nov 12, 2024 - 18:30
 0
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి
నా తెలంగాణ, హైదరాబాద్​: అర్హులైన జర్నలిస్టులందరికీ సీఎం రేవంత్​ రెడ్డి ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్​ (తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ రాష్​ర్ట కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్డు ఆదేశాలు, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినందుకు తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మిగతా జర్నలిస్టు సొసైటీలకు, సొసైటీలలో సభ్యత్వం లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని కోరారు. 
 
దాదాపు 40 ఏండ్లుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాలు, మండల కేంద్రాలలో ఇంకా వేలాది మంది జర్నలిస్టులు ఇండస్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని చెప్పారు. కొందరికి హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వం ఉందనీ, మరికొందరికి లేదని అన్నారు. వీరందరి కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానం ద్వారా ఇండ్లస్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
 
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టో ప్రకారం తొలి టర్మ్ లోనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. రెండో టర్మ్ లో ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం న్యాయం కాదని అన్నారు. ఇప్పటికే జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఇంకా ఏ మాత్రం జాప్యం జరిగినా మరింత ఆందోళన చెందుతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టి అర్హులైన జర్నలిస్టులందరికీ ఈ టర్మ్ లోనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.