లిక్కర్​ కేసు ఏప్రిల్​ 1 వరకు సీఎం కస్టడీ పొడిగింపు

ఈడీ కస్టడీకిస్తూ రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పు అనర్హత పిటిషన్​ ను కొట్టివేసిన హైకోర్టు

Mar 28, 2024 - 18:14
 0
లిక్కర్​ కేసు ఏప్రిల్​ 1 వరకు సీఎం కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్​ 1వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం మధ్యాహ్నం రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. కస్టడీ విషయంలో ఈడీ, కేజ్రీవాల్​ తరఫు న్యాయవాదులు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్​ కు ఐదు రోజుల రిమాండ్​ విధించింది. ఈడీ అధికారులు మాట్లాడుతూ సీఎం తమకు నేరుగా సమాధానాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. అందుకే ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్​ డేటాను విశ్లేషిస్తున్నామన్నారు. గోవా నుంచి ఈ కేసుకు సంబంధించి మరికొందరిని పిలిపించి ముఖాముఖి విచారించనున్నామని తెలిపారు. ఈడీ వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ఐదు రోజుల కస్టడీకి ఇచ్చింది. 

అనర్హత పిటిషన్​ కొట్టివేసిన హైకోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీఎం పదవికి అనర్హుడని దాఖలు చేసిన పిటిషన్​ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. సుర్జీత్‌ సింగ్‌  అనే సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో పదవిలో ఉండకూడదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. సీఎంగా కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతాయని, దాంతో న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే మాత్రమే కాకుండా.. రాజ్యాంగ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

మీడియాతో కేజ్రీవాల్​..

సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. కోర్టులో ఆయన స్వల్ప వ్యవధిలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్​ వెంట ఆప్ మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో పాటు ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టుకి హాజరయ్యారు. సీబీఐ 31 వేల పేజీల, ఈడీ 25 వేల పేజీల ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని అన్నారు. ఏడు స్టేట్‌మెంట్లలో ఆరింటిలో తన పేరు లేదన్నారు. కేసులో రూ. 100 కోట్ల అవినీతి జరిగితే, ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈడీ తనను కావాలనే దురుద్దేశ పూర్వకంగా ఈ కేసులో ఇరికిస్తోందని ఆరోపించారు.