ఇస్లాం పేరుతో లబ్ధి పొందాలనే ప్రయత్నాలు
విదేశాంగ విధానం లోప భూయిష్టం
13 దేశాలకు సభ్యదేశాల హోదా
మాస్కో: ఇస్లాం పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్న పాక్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బ్రిక్స్ దేశాల జాబితాలో చేర్చలేమని రష్యా డిప్యూటీ పీఎం డెనిస్ మంటురోవ్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భాగస్వామ్య దేశాలలో పాకిస్థాన్ ను చేర్చుకోకపోవడంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. మరోవైపు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బ్రిక్స్ దేశాల మార్కెట్ ప్రమాణాలకు పాక్ తూలతూగదన్నారు.
అదే సమయంలో 13దేశాలకు బ్రిక్స్ లో సభ్యదేశాల హోదా కల్పించామన్నారు. ఇందులో ఏడు ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. అల్జీరియా, మలేషియా, ఇండోనేషియా, కజాఖ్స్తాన్, నైజీరియా, టర్కియే, ఉజ్బెకిస్తాన్ సహా 7 ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయని తెలిపారు. నూతన దేశాలు బ్రిక్స్ లో చేరినప్పటికీ పని సామర్థ్యంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
జీ–7 దేశాలతో నేరుగా పోటీపడే బ్రిక్స్ దేశాలు పాక్ ను చేర్చుకుంటే ఆర్థికంగా బలహీనం అయ్యే అవకాశం ఉందన్నారు. పాక్ చేరితే పరిస్థితులు సార్క్ లాగా మారే అవాశం ఉందన్నారు. భారత్ తో పాక్ వ్యవహరిస్తున్న విధానాలు కూడా తమను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. పాక్ విదేశాంగ విధానం అత్యంత లోప భూయిష్టంగా ఉందన్నారు.