రేవంత్​ పై నేతల తిరుగుబాటు

Congress party leaders revolted against Revanth Reddy

Mar 28, 2024 - 15:54
 0
రేవంత్​ పై నేతల తిరుగుబాటు
  •  పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై కాంగ్రెస్​ నాయకుల నిలదీత
  •  ఒకే కుటుంబానికి టికెట్లు ఇవ్వడంపై హనుమంతరావు ప్రశ్న
  •  అక్రమార్కులను పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిలదీసిన లక్ష్మా రెడ్డి
  •  ఇద్దరు నేతల ప్రశ్నలను స్వాగతించిన హస్తం పార్టీ కార్యకర్తలు
  •  నష్టం జరగకుండా నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న రేవంత్​ రెడ్డి

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిపై కాంగ్రెస్​ నేతల తిరుగుబాటు మొదలైందా? రేవంత్​ నిర్ణయాలను బహిరంగంగానే నేతలు నిలదీస్తున్నారా? పార్టీ ముఖ్యనాయకులకూ ఆయన తీరు నచ్చడం లేదా? అంటే.. అవుననే సమాధానం వస్తున్నది. హస్తం పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. రేవంత్​ పై తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తున్నది. ఖమ్మం టికెట్​ ఆశించిన వీహెచ్​.. ఒకే కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారని రేవంత్​ ను ప్రశ్నించగా.. అక్రమార్కులకు పార్టీ గేట్లు ఓపెన్​ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆ పార్టీ సీనియర్​ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రేవంత్​ ను నిలదీశారు. వీరిద్దరు లేవనెత్తిన ప్రశ్నలను జెండా మోస్తున్న పార్టీ కార్యకర్తలు స్వాగతించారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా తిరుగుబాటు నేతలను బుజ్జగించారు రేవంత్​ రెడ్డి.

నా తెలంగాణ, హైదరాబాద్​: అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్​ రెడ్డిపై సొంత పార్టీ నేతలే.. తీవ్ర విమర్శలు చేశారు. ఒకానొక దశలో రేవంత్​ రెడ్డి కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనుక్కున్నారనే ఆరోపణలు కూడా హస్తం పార్టీ నేతల నుంచే వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకువెళ్లడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రేవంత్​ కు రాహుల్​ గాంధీ మద్దతు ఉండటంతో కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకులంతా.. రేవంత్​ తో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన మాటలను ఎవరూ ఇప్పటి వరకు జవదాటలేదు. ఇలా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కావడం, ఎంపీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక చేయాల్సి రావడంతో.. రేవంత్​ తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత పార్టీలో తిరుగుబాటు మళ్లీ మొదలైంది. 
వీహెచ్​ తిరుగుబాటు..
బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి.. రేవంత్​ తన స్థాయిని తగ్గించుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్​ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు ఇటీవల మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారని, అలాంటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వారిని పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దని, రేవంత్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డిని తాను కలిసి ఇవన్నీ చెబుతామంటే తనకు సమయం ఇవ్వడం లేదని, కాంగ్రెస్ కేడర్‌కు న్యాయం చేయకుండా కాంగ్రెస్​ నాయకులపై కేసులు పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని అన్నారు. ఒకే కుటుంబంలో ఎంత మందికి టికెట్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మీడియాతో బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్​ పార్టీలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. పార్టీ కేడర్​ వీహెచ్​ మాటలను స్వాగతించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన రేవంత్​ రెడ్డి.. వీహెచ్​ ను కలిసి బుజ్జగించారు. 
మరోనేత కూడా..
కాంగ్రెస్‌ను మోసం చేసిన దొంగలకు డోర్లు ఎలా తెరుస్తారు? అని పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నిలదీశారు. ‘కాంగ్రెస్‌ను మోసం చేసిన దొంగలకు డోర్లు తెరిచి పార్టీలో చేర్చుకుంటే మాలాంటి నాయకులు, కార్యకర్తలు చచ్చిపోతారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల సమావేశంలో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డితో కలిసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ సెగ్నెంట్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ను మోసం చేసిన దొంగలను పార్టీలో చేర్చుకుంటే తమలాంటి వాళ్లంతా ఏం కావాలి? అని ప్రశ్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఏకీభవిస్తూ పెద్దపెట్టున చప్పట్లు చరిచి మద్దతు పలికారు. దీనికి స్పందించిన రేవంత్​ రెడ్డి.. సర్వే ప్రకారమే నేతలకు టికెట్లు ఇస్తున్నామని చెప్పి ఆ ప్రశ్న నుంచి దాటవేశారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా గెలిచిన, అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్​ కాంగ్రెస్​ పార్టీలో చేరడం, ఆయనకు సికింద్రాబాద్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ టికెట్​ ఇవ్వడాన్ని కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రేవంత్​ రెడ్డిని నిలదీస్తూ.. అక్రమార్కులను కాంగ్రెస్​ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.