ఎండీఎంకే ఎంపీ ఆత్మహత్య
ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి (77) మృతిచెందారు. ఆయన నాలుగు రోజుల కిందట పార్టీ టికెట్ దక్కలేదన్న కారణంతో విష గుళికలు మింగారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కోయంబత్తూర్: ఎండీఎంకే ఎంపీ గణేశమూర్తి (77) మృతిచెందారు. ఆయన నాలుగు రోజుల కిందట పార్టీ టికెట్ దక్కలేదన్న కారణంతో విష గుళికలు మింగారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందారు. ఆయన మృతితో ఎండీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. 2019లో డీఎంకేతో ఎండీఎంకే జతకట్టింది. ఇందులో భాగంగా గణేశమూర్తికి ఈరోడ్ నుంచి టికెట్ దక్కింది. ఆ పోటీలో ఆయన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈరోడ్ నుంచి స్థానం దక్కుతుందనుకున్న గణేశమూర్తికి నిరాశే ఎదురైంది. ఆ స్థానం నుంచి దురై వైగోను పార్టీ అభ్యర్థిగా ఎండీఎంకే ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. 1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. 1998లో తొలిసారిగా పళని లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఓటమి పాలై, గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు 2లక్షల భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.