లాఫింగ్ యువరాజెక్కడా?
ఒక్క దెబ్బతో పేదరికం దూరం చేస్తారా? మీ అమ్మమ్మ ఎందుకు చేయలేకపోయారు? మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్ముతారా? మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
భోపాల్: ఒక్క దెబ్బతో దేశంలో పేదరికం మాయం చేస్తానన్న లాఫింగ్ యువరాజు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్ లోని ఔషంగాబాద్ పిపారిలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించారు. నీవు చెప్పినట్లుగా నిజం అయితే 50 ఏళ్ల క్రితమే మీ అమ్మమ్మ పేదరిక నిర్మూలన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 2014 కంటే ముందు రిమోట్ తో ప్రభుత్వాన్ని నడిపారని అంటున్నారు మరీ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోయారో? జవాబు చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ మంత్రాలకు చింతకాయలు రాలవని వీటిని ఎవ్వరూ నమ్మబోరని పైగా ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని మోదీ పేర్కొన్నారు.
దర్శన్ ను గెలిపించాలి..
బీజేపీ స్థానిక అభ్యర్థి దర్శన్ సింగ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ద్వారా మీ నియోజకవర్గ అభివృద్ధి ముడి పడి ఉందన్నారు.
మోదీకి దేశ హితమే లక్ష్యం..
మోదీకి ఎలాంటి ఆశలు లేవన్నారు. దేశ హితం, ప్రజాసంక్షేమమే తన లక్ష్యమన్నారు. తాను దేశం, ప్రజల కోసమే పుట్టానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అవినీతి రహిత పాలకులను ఎన్నుకుంటే దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఇప్పటికే ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. ప్రజలు దర్శన్ సింగ్ ను ఎన్నుకొని నియోజకవర్గ అభివృద్ధిలో మరింత వేగం పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాదరణ ఓర్వలేక బీజేపీపై కూటమి విమర్శలు..
తమ పార్టీనే బలోపేతం చేయలేని వారు దేశాన్ని ఏం బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. మీ ఒక్క ఓటు దేశాన్ని బలోపేతం చేస్తుందని మోదీ తెలిపారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి పార్టీలు అయోమయంలో పడి ఏమీ తేల్చుకోలేనట్లుగా ఉన్నాయన్నారు. దేశం నుంచి అణ్వాయుదాలను నిర్మూలిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని బలహీనపరిచే చర్యలను మేనిఫెస్టోలో కూడా పెట్టారంటే వీరిలో దేశ విచ్ఛిన్న ఆలోచనలు ఏ మేరకు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.
దేశ చరిత్రను వక్రీకరిస్తారా?
దేశ చరిత్రను ఇష్టానుసారం వక్రీకరించి ప్రపంచదేశాల్లో భారత్ కు కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ, మర్యాదలు, సంస్కృతి, సాంప్రదాయాలు లేవన్నట్లుగా పరిపాలన కొనసాగించారని మండిపడ్డారు. తామొచ్చాక అఖండ భారత్ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని అంటున్నవారు ఒక్కసారి తమ పాలనలో రోజుకో దాడులను గుర్తు చేసుకోవాలని అన్నారు. దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరేందుకు మీరే కారణమన్నారు. భారత్ లో తాముండగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దేశ హితమే లక్ష్యంగా ముందుకు పోతామని అన్నారు. అదే సమయంలో అవినీతి,అక్రమార్కులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంబేద్కర్ ను గౌరవించుకోరా?
రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు కూడా ఎన్నడూ కాంగ్రెస్ గౌరవించుకున్న పాపాన పోలేదన్నారు. ఆయన సూచించిన మార్గంలో నడవలేదని తెలిపారు. తాము ఆయన సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ కొత్త గుర్తింపును తీసుకువచ్చామని స్పష్టం చేశారు.