మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి
సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
నా తెలంగాణ, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో.. రైతులకు ప్రాజెక్టులూ అంతేనని చెప్పారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత ప్రభుత్వంలో నేతలు అన్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంత జరిగితే.. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా.. చూడనీయకుండా పోలీసు పహారా పెట్టారు. ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే వివరాలతో కూడిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. దీంతో తక్షణమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించాం. విజిలెన్స్ కమిటీ ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యం సహా అనేక విషయాలను అందులో ప్రస్తావించింది. ఇప్పటికీ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరాం. అదే జరిగితే అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుస్తాయి.ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తాం’’ అని రేవంత్ రెడ్డి వివరించారు.