గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు

18 నుంచి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ 

Nov 15, 2024 - 15:12
 0
గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు
నా తెలంగాణ, హైదరాబాద్​: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు కొనసాగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు, టీవీ న్యూస్ చానళ్ళలో పని చేస్తున్న జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు మరోసారి సభ్యత్వ నమోదు చేపట్టాలని సొసైటీ కార్యవర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు.ఈ మేరకు వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు ఉంటుందని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.  స్థానిక వర్కింగ్ జర్నలిస్టుగా కనీసం ఐదేళ్ల సర్వీస్ ఆధారాలతో పాటు ప్రస్తుతం జర్నలిస్టుగా పని చేస్తున్నట్లు ధృవీకరణ పత్రం (ఐడీ కార్డు, అక్రెడిటేషన్ కార్డు లేదా మీడియా సంస్థ నుంచి అపాయింట్మెంట్ లెటర్) తో పాటు స్థానిక నివాస ధృవీకరణ (ఆధార్ కార్డు లేదా గ్యాస్ బిల్, కరెంట్ బిల్లు), రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు దరఖాస్తు ఫారానికి జత చేయాలని వారు సూచించారు. 
 
వీటితో పాటు ఈ నెల 18 నుంచి 25వ తేదీ లోపల ‘గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ పేరిట రూ.1550 డీడీ, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తు ఫారానికి జత చేయాలని కోరారు. దరఖాస్తు ఫారాలు వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గరలోని టీవీ కాలనీ ఫేస్ 4, ప్లాట్ నెంబర్ 198లో గల సొసైటీ కార్యాలయంలో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు లభిస్తాయని, అర్హులైన జర్నలిస్టులు సభ్యత్వానికి కావలసిన సర్వీస్ ఆధారాలు, డీడీ తీసుకుని వచ్చి దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సర్వీస్ సీనియారిటీ కోసం మీ పూర్తి సర్వీసు సీనియారిటీ ఆధారాలు ఉంటే జత చేయాలని సూచించారు. మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ 9100933723, 7799681212, 9393353519 లను సంప్రదించాలని కోరారు.