బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు 11 మంది దుర్మరణం, 80మందికిపైగా క్షతగాత్రులు

ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 80మంది వరకు గాయాలయ్యాయి.

Feb 6, 2024 - 16:55
 0
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు 11 మంది దుర్మరణం, 80మందికిపైగా క్షతగాత్రులు

ఇండోర్​:మధ్యప్రదేశ్‌ లోని హర్దాలో బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 80మంది వరకు గాయాలయ్యాయి. 50కి పైగా స్థానికంగా ఉన్న ఇళ్లకు నష్టం వాటిల్లింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పెనువిషాదం చోటు చేసుకుంది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక శకటాలు, సహాయక బృందాలుచ, ఎన్డీఆర్​ఎఫ్​,ఎస్డీఆర్​ఎఫ్​ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. పేలుడు సందర్భంగా స్థానికంగా మంటలు వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు. పేలుడు సంభవించినప్పుడు కేంద్రంలో వందమంది వరకు కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు, స్థానికులు తెలిపారు. 
సీఎం విచారం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం.. విచారణకు ఆదేశం..
హార్దా టౌన్‌లో ఘోర విషాదం చోటుచేసుకోవడం ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఐపీఎస్ అజిత్ కేసరి, హోం గార్డ్ డీజీపీ అరవింద్‌ కుమార్‌ను ఆదేశించారు. క్షతగాత్రుల తక్షణ చికిత్సకు భోపాల్, ఇండోర్‌లోని మెడికల్ కాలేజీలు, భోపాల్ ఏఐఐఎంఎస్ బర్న్ యూనిట్‌కు అదేశాలిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించనున్నారు. కాగా, హార్దా జిల్లా ఆసుపత్రిలో 80 మంది వరకూ చేరారని, మరో 10 మందిని వేరే ఆసుపత్రికి పంపామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.