సరబ్ జిత్ హత్య.. నిందితుడు డాన్ సర్ఫరాజ్ హత్య
గుర్తు తెలియని దుండగుల దాడిలో మృతి ప్రకటించిన పాక్ మీడియా

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లాహోర్ లో సరబ్ జిత్ సింగ్ ను హత్య చేసిన అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఆదివారం పాక్ మీడియా వెల్లడించింది. సరబ్ జిత్ సింగ్ తరన్ తరణ్ జిల్లాలోని భిఖివింద్ గ్రామంలో నివసిస్తున్న భారత పౌరుడు. గూడాఛారి అని సరబ్ జిత్ సింగ్ కు పాక్ యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుంచి అతను జైలు జీవితాన్ని గడిపాడు. పలుమార్లు అతన్ని వదలిపెట్టాలని భారత్ దౌత్యం నెరపినా పాక్ ససేమిరా అని మొండిపట్టు పట్టింది. ఇక అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పాక్ తలొగ్గక తప్పని పరిస్థితులు ఏర్పడుతుండగానే సరబ్ జిత్ ను పాక్ జైలులో డాన్ సర్ఫరాజ్ ఐఎస్ఐ సూచనల మేరకు హత్య చేసినట్లు భారత్ ఇంటలిజెన్స్ స్పష్టం చేసింది.
కాగా 1990 ఆగస్టు 30న తనకు తెలియకుండానే దారితప్పి పాకిస్థాన్ సరిహద్దుకు చేరుకున్నాడు. అతడిని పాకిస్థాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. అతనిపై లేని పోని ఆరోపణలన్నీ మోపి ఓమారు బాంబుదాడులకు పాల్పడ్డ నిందితుడని, మరోమారు భారత గూడాచారి అని నిందలు మోపింది. అనంతరం జైలు శిక్ష అనుభవిస్తుండగా లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైలులో ఖైదీలు దాడి చేశారని, బ్రెయిన్ డెడ్ అయ్యాడని పాక్ ప్రకటించింది. అటుపిమ్మట భారత్ ఇంజలిజెన్స్ ఆయన హత్యపై పూర్తి సమాచారాన్ని రాబట్టింది.
కాగా ఇటీవలే పలు వేదికలపై ఉగ్రవాదానికి దాని భాషలోనే సమాధానం చెబుతామని వారి దేశంలోకి వెళ్లి మరీ జవాబు చెబుతామని పలు వేదికలపై పలువురు మంత్రులు బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సరబ్ జిత్ ను హత్య చేసిన వారు హత్య గావింపబడ్డారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు భారత్ తమకు న్యాయం చేసిందని అన్నారు.