కాంగ్రెస్ కు వరుస షాక్ లు ఢిల్లీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ బిధూరి రాజీనామా!
ఆప్ తో పొత్తుపై నిరాశ, నిస్పృహలే కారణం
నా తెలంగాణ, న్యూఢిల్లీ: మూడో దశ ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తప్పడం లేదు. గురువారం తుగ్లకాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆ పార్టీని వీడారు. రాజీనామా సమర్పించారు. ఎక్స్ మాధ్యమంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాంతం నుంచి హస్తం పార్టీకి ఓం ప్రకాశ్ బిధూరి మూలస్తంభంలా ఉన్నారు.
ఆప్ పార్టీతో పొత్తుపై ఈయన కూడా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలోని పలు చర్యలు కూడా ఇతన్ని ఇరకాటంలోకి నెట్టాయి.
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ సింగ్ లవ్లీ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే మరో ఇద్దరు నసీబ్ సింగ్, నీరజ్ బసోయాలు కూడా బుధవారం రాజీనామా సమర్పించారు. తాజాగా బిధూరి రాజీనామాతో ఢిల్లీ కాంగ్రెస్ ఖాళీ అవుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
కాగా లవ్లీ సింగ్ రాజీనామా సందర్భంగా బిధూరి ఆయన చెప్పిన కారణాలను అంగీకరించారు.
రాజీనామాపై ఓం ప్రకాశ్ బిధూరి మాట్లాడుతూ.. ఆప్ తో పొత్తుకారణంగానే పార్టీని వీడుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గతంలో, ప్రస్తుత ఎన్నికల్లో కూడా దొంగలు అని, అవినీతిపరులని వ్యాఖ్యలు చేస్తుంటే అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఢిల్లీలో సొంతంగా రంగంలోకి దిగుదామన్నా పట్టించుకోకపోవడంతోనే మనస్థాపం చెందినట్లు ప్రకటించారు.
కాగా ఓం ప్రకాశ్ బిధూరి కాంగ్రెస్ ను వీడి ఏ పార్టీలో చేరనున్నారనే విషయాన్ని ప్రకటించలేదు.