ఇద్దరి పరిస్థితి విషమం
దీపావళి సందర్భంగా భారీ రద్దీతో ప్రమాదం
ముంబాయి: ముంబాయిలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బిహార్, యూపీ ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇళ్లకు చేరుకునేందుకు ఆదివారం ఉదయం భారీగా వచ్చారు. 5 గంటల ప్రాంతం నుంచే రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయిందని అధికారులు తెలిపారు. గోరఖ్ పూర్ బాంద్రా ఎక్స్ ప్రెస్ రైలు ఫ్లాట్ ఫారమ్ నంబర్ 1పై రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లుగా అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ ముంబాయిలోని బాబా ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.
క్షతగాత్రుల పేర్లను అధికారులు విడుదల చేశారు. షబీర్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ గుప్తా (28), రవీందర్ హరిహర్ (30), రామసేవక్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాంగే (27), దివ్యాంశు యాదవ్ (18), షరీఫ్ షేక్ (25), ఇందర్‌జిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ (18).