పాక్‌లో పేలుళ్లు 28 మంది మృతి, 40 మందికి గాయాలు
పాక్ లో ఎన్నికలకు ఒక్కరోజు ముందు భారీ బాంబుదాడులు జరిగాయి.
ఇస్లామాబాద్: పాక్ లో ఎన్నికలకు ఒక్కరోజు ముందు భారీ బాంబుదాడులు జరిగాయి. బుధవారం జరిగిన రెండు బాంబు దాడుల్లో 28 మంది మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ లో ఈ పేలుళ్లు సంభవించాయి.
పాక్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న అస్పంద్ ఖాన్ కకర్ లక్ష్యంగా ఈ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు మీడియా వెల్లడించింది. ఆయన కార్యాలయం బయటే బాంబు దాడులు జరిగాయి. పేలుళ్లు జరిగినప్పుడు ఆయన కార్యాలయంలో లేడు.
ఫిషిన్ లో జరిగిన దాడుల్లో 15 మంది మృతిచెందగా, 30 మంది గాయపడ్డారు. జేయూఐ–ఎఫ్ అభ్యర్థి మౌలానా అబ్దుల్ వాసే లక్ష్యంగా మరో పేలుడు చోటు చేసుకుంది. దాడి జరిగినప్పుడు ఆయన బలూచ్ లోని ఖిలా సైఫుల్లా ప్రాంతం కార్యాలయంలోనే ఉండగా, పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ దాడిలో 13 మంది మరణించగా, 10 మంది గాయపడ్డారు.
ఫిబ్రవరి 8 (గురువారం) పాక్ లో ఎన్నికలు జరగనున్నాయి. దాడులపై బలూచ్ చీఫ్ సెక్రెటరీని పాక్ ఎన్నికల సంఘం నివేదిక కోరింది.
రెండు దాడుల్లో కార్యాలయం బయట ఉన్న బైక్ లో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో ఆ పిషిన్, బలూచ్ ప్రాంతాలు బీతావహంగా మారాయి.
దాడులపై దర్యాప్తు కొనసాగుతోంది..
పేలుళ్లపై బలూచిస్థాన్ కేర్ టేకర్ సమాచార మంత్రి జన్ అచక్జాయ్ మాట్లాడుతూ - మొదటి పేలుడు ప్రాథమిక దర్యాప్తులో పేలుడు పదార్థాన్ని బైక్‌లో ఉంచినట్లు తేలిందన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ కొనసాగుతోందన్నారు. రెండో పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్ కూడా వినబడుతోంది. ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు, ఆర్థిక మాంద్యం కూడా కారణాలుగా పేర్కొన్నారు.