ఇమ్రాన్ విడుదల కోరుతు నిరసనలు
Protests demand Imran's release
ఆందోళనతో అట్టుడుకుతున్న రాజధాని ఇస్లామాబాద్
ఆందోళనలు అణిచివేయాలి, మానవహక్కులకు భంగం వద్దు: అమెరికా
ఇస్లామాబాద్: పాక్ లో వేలాది మంది మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు రోడ్లపైకి వచ్చారు. రాజధాని ఇస్లామాబాద్ లో భారీ నిరసనలు చేపట్టారు. మంగళవారం చేపట్టిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల పెద్ద యెత్తున పోలీసుకు, ఆందోళనకారులకు మధ్య హింస చోటు చేసుకుంది. మరోవైపు ఆందోళనలను అణచివేయాలని, అదే సమయంలో మానవహక్కులకు భంగం కలిగించవద్దని అమెరికా పాక్ కు విజ్ఞప్తి చేసింది. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీకి చెందిన వేలాది మంది ఒక్కసారిగా ఇస్లామాబాద్ లో నిరసనలకు దిగారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. వందమందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ‘డూ ఆర్ డై’ అని జైలు నుంచే ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ పై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. పాక్ లో శాంతి నెలకొనాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఆకాంక్షిచారు. శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని, ఆందోళనలు, హింసకు తావీయరాదన్నారు. అదే సమయంలో పాక్ పోలీసులు, ప్రభుత్వం ప్రాథమిక స్వేచ్ఛను గౌరవించాలన్నారు. ఆందోళనల సందర్భంగా 3500మంది ఇమ్రాన్ మద్ధతుదారులు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.