నా తెలంగాణ, నిర్మల్: గత కొన్ని నెలలుగా నిర్మల్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న హరియాణాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మహ్మద్ అబ్బాస్ ను నిర్మల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన విషయాలను డీఎస్పీ గంగారెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గాజులపేట్ కాలనీలో ఉన్న అబ్బాస్ అంగడిలో పనిచేస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడన్నారు. పలు కేసుల్లో అతని వేలిముద్రలు గుర్తించి నిఘా వేసి గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు క్లూస్ టీమ్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐలు సాయికృష్ణ, రవిలు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో గుర్తించారని తెలిపారు. నిందితుని వద్దనుంచి 20 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండితో పాటు 150 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ వివరించారు. నిందితునికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా మంజూరైందని గుర్తించామని తెలిపారు.
ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు ప్రవీణ్, రామకృష్ణ, ఎస్ ఐలు రమేష్, సాయికృష్ణ, రవి, గోపిలతో పాటు సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.