అలజడికి ప్లాన్​ అమాయక యువతకు గాలం

మీడియాతో నక్సల్స్​ ఆపరేషన్​ ఐజీ సందీప్​ పాటిల్​

Feb 24, 2024 - 17:18
 0
అలజడికి ప్లాన్​ అమాయక యువతకు గాలం
నాగ్​ పూర్​: రానున్న లోక్​ సభ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు అమాయక యువతను రెచ్చగొట్టి ట్రాప్​ లో దింపి వారి ద్వారా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేలా ప్రోత్సహించేందుకు నక్సల్​ ప్రయత్నం చేస్తున్నట్లు మహారాష్ర్ట నక్సల్ ఆపరేషన్​ ఐజీ సందీప్​ పాటిల్​ పేర్కొన్నారు. ఈ విషయంపై పాటిల్​ శనివారం మీడియాతో మాట్లాడారు. ముంబై, నాసిక్​, థానే, గోండియా, భండారా, పూణె వంటి పట్టణ ప్రాంతాల్లో యువతను ట్రాప్​ లో దింపేందుకు వారిని బ్రెయిన్​ వాష్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ వద్ద కీలక సమాచారం ఉందన్నారు.  
 
చొరబాట్లపై కీలక ఆధారాలు..
నగరాల్లో నక్సల్స్ చొరబాట్లకు సంబంధించిన కీలక ఆధారాలను యాంటీ నక్సల్ బృందం కనుగొన్నట్లు ఆయన వివరించారు. మావోయిస్టులతో సంబంధం ఉన్న అర్బన్ నక్సల్స్ మురికివాడల్లోని యువతను బ్రెయిన్ వాష్ చేసి పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఈ ఆపరేషన్ సందర్భంగా నక్సలైట్ల రహస్య పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నక్సలైట్లు పెద్ద ఎత్తున క్రియాశీలకంగా మారారని దీన్ని బట్టి స్పష్టమవుతోందని సందీప్​ పాటిల్​ తెలిపారు. 
 
పత్రాల ద్వారా వెల్లడి..
రాబోయే రెండు నెలల్లో పౌరహక్కుల సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, మైనారిటీ సంఘాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్​ సమీకరించనున్నారని ఆ పత్రాల ద్వారా వెల్లడైందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలనేది వారి వ్యూహంగా కనబడుతోందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నెలన్నర క్రితం ముంబై, నాసిక్, థానే, న్యూ ముంబైలోని అన్ని ప్రాంతాల్లో ఆయన సమావేశాలు కూడా నిర్వహించారనే సమాచారం లభించిందన్నారు. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రతికూల మనస్తత్వాలున్న నిస్సహాయ యువత త్వరగా ఇలాంటి చర్యలకు ఆకర్షితులవుతులవుతుండడం బాధాకరమన్నారు. 
 
డేగకళ్లతో నిఘా పటిష్టం.. తల్లిదండ్రులు జాగ్రత్త..
నక్సల్స్​ చర్యలపై డేగకన్నుతో నిఘాను పటిష్టం చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆయా సంఘాలు, మురికివాడలపై నిఘాను పెంచనున్నామని స్పష్టం చేశారు. నక్సల్స్​ సమాచారం అందితే తమకు అందజేయాలని ప్రచారం చేస్తున్నామని, అదేసమయంలో తల్లిదండ్రులు తమ యువకులైన పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలన్నారు. వారు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయంపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. తాము తెలిపినట్లుగా ఎవరైనా వారి మానసిక స్థితిపై ప్రభావం చూపేలా మాటలు చెబితే అలాంటి వారి ఆచూకీని తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. అలా తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటు వారికి తగిన బహుమతిని అందజేస్తామని మహారాష్ర్ట ఐజీ సందీప్​ పాటిల్​ స్పష్టం చేశారు.