రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరి భద్రత
ఇంటలిజెన్స్ హెచ్చరికలు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాదం పొంచి ఉందన్న కారణంతోనే వీఐపీ భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీఆర్పీఎఫ్‌కి చెందిన 40-45 మంది సాయుధ కమాండోలను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ కుమార్ ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ కుమార్ 1984కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరు ఆయనకుంది. ఎవ్వరికీ భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఒత్తిళ్లు లాంటి వాటికి తలొగ్గరనే పేరు, ప్రఖ్యాతులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భద్రత పట్ల ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం భద్రత పెంపు నిర్ణయాన్ని తీసుకుంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతుంది. రెండో విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.