నైనిటాల్ లో రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది మృతి
ఇద్దరికి తీవ్ర గాయాలు మృతులంతా నేపాలీలు
నైనిటాల్: నైనిటాల్ సమీపంలోని బేతాల్‌ఘాట్‌లో సోమవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నైనిటాల్ సమీపంలోని బేతాల్‌ఘాట్ ప్రాంతంలోని మల్లా గ్రామంలోని ఉంచకోట్ మోటార్ రహదారిపై సోమవారం అర్థరాత్రి 10:30 గంటల సమయంలో తాగునీటి పైప్ లైన్ వేసేందుకు పలువురు కూలీలు వెళ్లి తిరిగి వస్తున్నారు. బేతాల్ ఘాట్ వద్దకు రాగానే పికప్ వ్యాన్ అదుపు తప్పి లోయలోకి పడిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. స్థానిక ఆసుపత్రిలో ఇద్దరికి చికిత్సనందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందినట్లు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తాము సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి అనీఫ్ అహ్మాద్ మీడియాకు వివరించారు.