ఉగ్ర భావజాలంలో యూనస్​ ప్రభుత్వం

Yunus government in extremist ideology

Nov 27, 2024 - 15:27
 0
ఉగ్ర భావజాలంలో యూనస్​ ప్రభుత్వం

హిందువులపై దాడులు అడ్డుకోవడంతో విఫలం
నిరసనకారులపై ముష్కరుల దాడులు
ఫోటోలు, వీడియోలు, వార్తల్లో బహిర్గతం
చర్యలు చేపట్టిన బంగ్లా ప్రభుత్వం
చిన్మోయ్​ అరెస్ట్ భారత్​ ప్రకటనపై అభ్యంతరం
నవరాత్రి ఉత్సవాల్లోనూ దాడులు
మోదీ బహూకరించిన కిరీటం చోరీ
శాశ్వత ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించని తాత్కాలిక ప్రధాని
ఆర్థికంగా ఆదుకోని భారత్​
ఆగ్రహంతోనే హిందువులపై దాడులు
బంగ్లా భూభాగంపై చైనా కన్నూ

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బంగ్లా తాత్కాలిక యూనస్​ ప్రభుత్వం పూర్తిగా ఉగ్రవాద భావజాలం ఉన్న నాయకుల అదుపులో చిక్కుకుంది. హిందుదేవాలయాలు, వ్యక్తులు, ఆస్థులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పైగా శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిని అరెస్ట్​ చేయించడమే గాకుండా వారిపై దాడులకు ప్రేరేపిస్తోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇస్కాన్​ మత గురువు కృష్ణదాస్​ అరెస్ట్​ తరువాత మరోసారి హిందువులపై దాడులకు ఇస్లామిక్​ వాదులు తెగబడుతున్నారు. అరెస్టును ఖండిస్తూ చేస్తున్న నిరసనకారులపై ఇష్టారీతిన దాడులకు పాల్పడుతున్నారు. ఈ దృశ్యాలు అన్ని మీడియా, సోషల్​ మీడియా మాధ్యమంగా కనిపిస్తున్నా బంగ్లా తాత్కాలిక యూనస్​ ప్రభుత్వం మాత్రం దాడులను ఆపడంలో పూర్తిగా విఫలమవుతుంది. దాస్​ ను అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని భారత్​ ఖండించింది. భారత్​ చేసిన విజ్ఞప్తిని కూడా బంగ్లాదేశ్​ తిరస్కరించింది. అంతేగాక పొరుగు దేశాల మధ్య స్నేహం, స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది. 

బుధవారం కూడా చిన్మోయ్​ అరెస్టు, హిందువులపై పలు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు చేపడుతుండగా భారీ ఎత్తున ముస్లింలు వారిపై దాడులకు దిగారు. మైనార్టీల హక్కులను కాపాడడంలో ఆ దేశం పూర్తిగా విఫలమైందని భారత్​ ఆరోపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా దుర్గామాత విగ్రహాలపై ముష్కరులు దాడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ఆలయంలో కిరీటం బహుమతిగా ఇవ్వగా దాన్ని కూడా దుండగులు దొంగిలించారు. బంగ్లాదేశ్​ లో అడుగడుగునా హిందువులపై దాడులకు పాల్పడుతూ మానవహక్కుల ఉల్లంఘనలకు దిగుతున్నారు.అయినా దాడులకు పాల్పడినవారిని బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయకుండా తూతూ మమ అనే చర్యలు తీసుకుంటూ తప్పించుకుంటోంది. 

తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికైన మూడు నెలల్లోనే శాశ్వత ప్రభుత్వం ఏర్పాటు దిశగా యూనస్​ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. ఎన్నికల దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు హిందువులపై దాడులతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్​ బంగ్లాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను తగ్గించుకుంటూ వస్తుంది. ఇదే బంగ్లా ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న బంగ్లాదేశ్​ కు అప్పుపుట్టడం కూడా గగనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ కోపాన్ని హిందువులపై ప్రదర్శిస్తూ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి హిందువులపై దాడులు చేస్తూ మైనార్టీలను కాపాడుకునే బాధ్యతలో బంగ్లా ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్​ లో అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడేందుకు ఎంతో కాలం పట్టదు. అదే సమయంలో ఆ దేశ ఆర్థిక స్థితులు కూడా పూర్తిగా దిగజారే పరిస్థితులున్నాయి. ఓ వైపు చైనా ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే బంగ్లాతో జతకట్టి ఆ దేశ భూభాగంపై కన్నేసింది.