సీఎం కాదు.. ప్రజా సేవే లక్ష్యం
షిండే ప్రకటనతో ఫడ్నవీస్ కు లైన్ క్లియర్
నేడో రేపో ఫడ్నవీస్ పేరును ప్రకటించనున్న బీజేపీ
ముంబాయి: తన లక్ష్యం సీఎం పదవి కాదని, ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలకు సేవ చేయడమేనని మహారాష్ర్ట తాత్కాలిక సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. మహాయుతి కూటమిలో సీఎం ఎవ్వరైనా కూటమి లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రజల మేలు కోసం పని చేసేందుకు సిద్ధంఆ ఉన్నామన్నారు. బుధవారం సాయంత్రం ఏక్ నాథ్ షిండే విలేఖరుల సమావేశం నిర్వహించారు. సీఎం లక్ష్యం ఇప్పటికే పూర్తి అయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు తనకు అడుగడుగునా అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు, పథకాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిని ఎన్నుకున్నా తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పారు. ఎన్డీయే నేతగా ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా శివసేన (షిండే) వర్గం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఆ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తామన్నారు. ప్రజలు మహాయుతికి పెద్ద యెత్తున మద్ధతుతెలిపి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తాను అందరికోసం పోరాడే వ్యక్తినని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కోసమే పనిచేశానని, ప్రస్తుతం కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని అన్నారు. షిండే ప్రకటనతో దేవేంద్ర పఢ్నవీస్ సీఎం పదవికి ఉన్న అడ్డంకి పూర్తిగా తొలగినట్లయ్యింది. ఫడ్నవీస్ పేరును నేడో, రేపో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
గురువారం షిండే, ఫడ్నవీస్, పవార్ లతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. అనంతరం సీఎం ప్రకటన వెలువడనున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.