యువత రాజకీయాల్లోకి రావాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ కాన్ఫరెన్స్ లో ప్రధాని
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజకీయాలకతీతంగా లక్షలమంది యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా న్యూ డిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న డెవలప్డ్ ఇండియా యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొని యువకులతో సంభాషించారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేసిన స్టాళ్లను, వారు ప్రదర్శిస్తున్న పలు వస్తువులను పరిశీలించి వాటిగురించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. యువతను ప్రోత్సహించారు. భారత్ మండపంలో 10 అంశాలకు సంబంధించిన ప్రదర్శనలను వీక్షించారు. ప్రదర్శనలో మేటీ ప్రదర్శనలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం ప్రధాని మీడియాతో సంక్షిప్తంగా మాట్లాడారు. దేశ యువత సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, కల్చర్ అంశాల్లో మక్కువ చూపుతుందన్నారు. సంప్రదాయబద్ధంగా యూత్ ఫెస్టివల్ నిర్వహణతో యువతలోని విభిన్న కోణాలను బయటకు తీసుకొస్తామన్నారు. దీంతో అభివృద్ధి చెందిన భారత్ ఆలోచనలు సాకారం చేస్తామన్నారు. ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, కీలకమని అన్నారు. నిరంతరం యువత అప్ గ్రేడ్ దిశగా అడుగులు వేయాలన్నారు. భారత్ అభివృద్ధికి నూతన ఆవిష్కరణల సహకారం అవసరమన్నారు. యువత దీనికి అనుగుణంగా ఎదగాలన్నదే తమ అభిమతం అని మోదీ తెలిపారు. అంతేగాకుండా రాజకీయాలకతీతంగా యువత రాజకీయాల్లోకి వస్తే దేశంలో మరిన్ని మార్పులు సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.