చల్లారని మంటలు శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
Rescue teams are working to extinguish the fire
80కి.మీ. వేగంతో గాలులు
పడిపోతున్న రిజర్వాయర్ల నీటిమట్టం
బైడెన్ పై ట్రంప్ విమర్శలు
హోటళ్లలో నివసిస్తున్న హాలీవుడ్ ప్రముఖులు
అగ్నిప్రమాద ప్రాంతాల్లో 350కి ఎక్యూఐ
వాషింగ్టన్: లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా కార్చిచ్చు ఏ మాత్రం తగ్గడం లేదు. రెస్క్యూ బృందాలు చేస్తున్న ప్రయత్నాలకు వాతావరణం అడ్డంకులు సృష్టిస్తుంది. గత వారం రోజులుగా చెలరేగిన కార్చిచ్చు వల్ల ఆదివారం వరకూ వేర్వేరు ప్రాంతాల్లో 16 మంది మృతి చెందారు. చాలామంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటివరకూ 11.6 లక్షల కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఆదివారం వరకూ 35వేల ఎకరాల్లో మంటలంటుకొని కాలి బూడిదయ్యాయి. మెక్సికో నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు గంటకు 80కి.మీ. వేగంతో గాలులు వీస్తుండడం సహాయక చర్యలకు ప్రతిబంధంగా మారింది.
మాండెవిల్లె, హాలిసాడ్స్, పలిసదేస్, ఈటన్ లలో మంటలు చెలరేగి కార్లు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు భారీగా నీటి వినియోగం అవసరం అవుతుండడంతో ఆయా ప్రాంతాల్లోని తాగునీటి రిజర్వాయర్ నీటిని వాడుతున్నారు. దీంతో రిజర్వాయర్లలో కూడా నీటిమట్టం భారీగా పడిపోతుంది. మంటలను ఆర్పేందుకు విమానాలు, అగ్నిమాపక శకటాలతో రెస్క్యూ బందాలు రంగంలోకి దిగినా గాలుల కారణంగా మంటలు ఇతర చోట్లకు పాకుతున్నాయి. పారిస్ హిల్టన్, టామ్ హాంక్స్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో ప్రముఖులు ప్రస్తుతం హోటళ్లలోనే నివసించాల్సి వస్తుంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఇంటిని కూడా అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదంపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత జో బైడెన్ ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాగా అగ్నిప్రమాదంపై విభిన్న వాదనలున్నాయి. ఒక వ్యక్తి అడవిలో నిప్పు పెట్టడంతోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని సోషల్ మీడియాలు చిలువలు పలువలుగా వార్తలు వస్తున్నాయి. కాగా అనుమానం నేపథ్యంలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ వాదనను అధికారులు ఖండించారు. మంటలు చెలరేగేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అగ్నిప్రమాదంలో ఎక్యూఐ 350 దాటి విషపూరితంగా మారడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.